పట్టుదలతో ఆర్మీ అధికారి అయిన అమరజవాన్‌ భార్య

డెహ్రాడూన్‌,మార్చి11(జ‌నంసాక్షి):  అమర జవాన్‌ భార్య ఆర్మీ అధికారిణి అయిన స్ఫూర్తివంతమైన యదార్థగాథ చెన్నైలోని ఇండియన్‌ ఆర్మీ అధికారుల అకాడవిూలో వెలుగు చూసింది. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో భారత సైనికుడైన శిషీర్‌ మాల్‌ మరణించారు. శిషీర్‌ మాల్‌ గూర్ఖా రైఫిల్స్‌ దళంలో పనిచేస్తూ జమ్మూకశ్మర్‌ రాష్ట్రంలోని బారాముల్లా సెక్టార్‌ లో 2015 సెప్టెంబరులో ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో మరణించారు.శిషీర్‌ మాల్‌ సతీమణి సంగీతామాల్‌ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ భర్త మృతి అనంతరం ఆ ఉద్యోగాన్ని వదిలివేశారు. భర్త మరణం తెచ్చిన విషాదం వల్ల సంగీతకు గర్భస్రావం అయింది. అనంతరం కోచింగ్‌ తీసుకొని ఆర్మీ పరీక్ష రాసిన సంగీత ఆర్మీ లెప్టినెంట్‌ గా ఎంపికయ్యారు. అనంతరం ఆర్మీ అధకారిణిగా చెన్నైలోని ఆర్మీ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన సంగీత ఇండియన్‌ ఆర్మీ అధికారిణిగా పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ లో పాల్గొన్నారు. దేశం కోసం తన భర్త ప్రాణాలిచ్చాడని, ఆయన ఆశయ సాధన కోసం తాను కూడా ఆర్మీలో చేరానంటారు సంగీత. భర్త మరణించినా ఆయన ఆశయ సాధన కోసం శ్రమించి ఆర్మీ అధికారిణి అయిన సంగీతకు మనమూ హాట్సాఫ్‌ చెబుదాం.