పత్రికా ఎడిటర్‌ ను..  అరెస్ట్‌ చేసిన తమిళ పోలీసులు 

– గవర్నర్‌పై తప్పుడు కథనం రాసిన గోపాల్‌
– చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
చెన్నై, అక్టోబర్‌9(జ‌నంసాక్షి) : తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌పై తప్పుడు కథనం రాసినందుకు గాను ప్రముఖ జర్నలిస్ట్‌ నక్కీరన్‌ గోపాల్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. తమిళ వీక్లీ ‘నక్కీరన్‌’కు ఆయన ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. పుణె వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి వచ్చిన నక్కీరన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్కులు కావాలంటే ఉన్నతాధికారుల కోరికలు తీర్చాలంటూ తమిళనాడులోని కాలేజీ ప్రొఫెసర్‌ నిర్మలాదేవీ విద్యార్థులను వ్యభిచారంలోకి దించుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఆమె గవర్నర్‌ వద్దకు విద్యార్థులను తీసుకెళ్లిందని నక్కీరన్‌ తన కథనంలో పేర్కొన్నారు. దీంతో నక్కీరన్‌పై రాజ్‌భవన్‌ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ‘గవర్నర్‌ పురోహిత్‌ను కలిసినట్లు ప్రొఫెసర్‌ నిర్మలాదేవీ పోలీసుల విచారణలో అంగీకరించారు. గవర్నర్‌ చీఫ్‌ సెక్రటీరిని కొంత మంది విద్యార్థినులు కలిశారు. అందుకే గవర్నర్‌ ఈ కేసుపై విచారణ చేసేందుకు అంగీకరించడం లేదు అంటూ నక్కీరన్‌ తన కథనంలో రాసుకొచ్చారు. గవర్నర్‌పై అసత్య ఆరోపణలు చేస్తూ, ఆయన గౌరవానికి భంగం వాటిల్లే విధంగా అమర్యాదకరంగా కథనాన్ని ప్రచురించినందుకుగాను నక్కీరన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను గవర్నర్‌ ఖండించారు. నిందితురాలైన ప్రొఫెసర్‌ నిర్మలాదేవీని తాను ఎప్పుడూ కలవలేదని ఆయన చెప్పారు. ఈ కేసు విచారణ చేపట్టేందుకు రిటైర్డ్‌ ఉన్నతాధికారి ఆర్‌.సంథమ్‌ను ఆయన నియమించారు. కొంతమంది విద్యార్థినులతో నిర్మలా దేవీ మాట్లాడినట్లు ఉన్న ఆడియో క్లిప్స్‌ ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆమెను ఏప్రిల్‌లో పోలీసులు అరెస్టు చేశారు. నక్కీరన్‌ గోపాల్‌ గతంలో కరుడుగట్టిన గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌తో సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే.