పదవి లేకున్నా సర్పంచులు ముందుండాలి
హరితహారం కోసం కలెక్టర్ పిలుపు
వరంగల్,జూలై20(జనం సాక్షి): హరితహారం ప్రారంభం రోజు మండల పరిధిలోని వీఐపీలతో మొక్కలను నాటించాలని వరంగల్ రూరల్ లెక్టర్ హరిత కోరారు. హరితహారం నిర్వహించే సమయంలో సర్పంచ్లు, ఎంపీటీసీల పదవీకాలం ముగిసినా భాగస్వాములు కావాలని చెప్పారు. ఉద్యమస్ఫూర్తితో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున తెలంగాణకు హరితహారం నాలుగో విడతను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు మొక్కలు నాటడం ప్రారంభించాలన్నారు. జిల్లాలోని అన్నారం షరీఫ్ దర్గా ప్రాంతంలో ప్లాంటేషన్ చేయాలని, కమ్యూనిటీ ప్లాంటేషన్ చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాజక్టులు, అభివృద్ధి పనుల కోసం చేపట్టిన భూసేకరణ పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. ఇకపై జరిపే భూసేకరణను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కు సంబంధించిన 1140ఎకరాల భూసేకరణ ఎలా జరిగిందో వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాలనిచెప్పారు. మిగతా 58ఎకరాల భూసేకరణ, కోనాయిమాకుల లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు.