పల్లెనిద్రతో ప్రజలకు చేరువవుతున్న స్పీకర్‌

దుక్కిదున్ని రైతు వెన్నుతట్టిన ముధుసూధానాచారి

ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే అని ప్రకటన

జయశంకర్‌ భూపాలపల్లి,జూన్‌9(జనం సాక్షి ): తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి పల్లెనిద్రతో ప్రజలను తట్టి లేపుతున్నారు. గ్రామాల్లో నిద్రచేస్తూ వేకువసమయాన్నే వారితో కలసి చాయ్‌ తాగుతూ సమస్యలు తెలుసుకుంటున్నారు. వారిలో ఒకడిగా ముందుకు సాగుతున్నారు. తాజాగా ఓ పొలంలో రైతుతోపాటు దుక్కిదున్నారు. గణపురం మండల కేంద్రంలో నిర్వహించిన ప్లలెబాటలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో భాగంగా శనివారం ఉదయం ప్రజలతో కలిసి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన రైతులతో కలిసి దుక్కిదున్నారు. స్పీకర్‌ రాకతో గణపురం జనసందోహంగా మారింది. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా జనం పోటెత్తడంతో పండుగ వాతావరణం నెలకొంది. అన్ని వాడలు జనంతో కిక్కిరిసిపోయాయి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి గణపురం మండల కేంద్రంలో చేపట్టిన ప్లలె ప్రగతి నిద్ర కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. బతుకమ్మలు, కోలాటాలు, డప్పుచప్పుళ్ల మధ్య మహిళలు మంగళహారతులతో ఎదురొచ్చి నుదుట తిలకం దిద్ది ఘనస్వాగతం పలికారు. ప్లలె ప్రగతి నిద్రలో భాగంగా చేపట్టిన పాదయాత్ర శుక్రవారం సాయంత్రం 7 గంటలకు సాయిబాబా గుడి నుంచి మొదలై చెంచుకాలనీ వరకు సుమారు 3కిలో విూటర్ల మేర కొనసాగింది. ఈ యాత్రలో స్పీకర్‌ అన్ని వర్గాలతో మమేకమై సమస్యలను వింటూ కొన్నింటిని పరిష్కారం చూపుతూ ముందుకు సాగారు. తమ నాయకుడు గ్రామంలో వాడవాడకు తిరుగాడుతుంటే టీఆర్‌ఎస్‌ శ్రేణులు వెంటే ఉంటూ స్పీకర్‌ తమ గ్రామానికి చేసిన అభివృద్ధినికొనియాడారు. స్పీకర్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టినప్పటికీ గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించేందుకే ప్లలె ప్రగతి నిద్ర కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. గత పాలకులు 70ఏళ్లలో చేయని అభివృద్ధి తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత నాలుగేళ్లలో గణపురం గ్రామాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. గణపసముద్రం చెరువును రిజర్వాయర్‌గా తీర్చిదిద్ది రూ.17 కోట్లతో రామప్ప నుంచి గ్రావిటీ కెనాల్‌ నిర్మిస్తున్నామన్నారు. దీంతో గణపురం మండలంలో ఇప్పుడు సాగవుతున్న 4వేల ఎకరాలకు అదనంగా 20వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. గణపురం మండల కేంద్రంలో కోటి రూపాయలతో సీసీ రోడ్లు, రూ.2కోట్ల49 లక్షలతో మోరంచ వాగుపై హైలెవల్‌ వంతెన, అదేవిధంగా గణపురం మత్తడి వద్ద రూ.కోటీ95లక్షలతో హైలెవల్‌ వంతెన నిర్మించినట్లు తెలిపారు. ఇంతేకాకుండా రూ.65 లక్షలతో మిషన్‌ కాకతీయ ద్వారా పెద్దమ్మకుంట, కుమ్మరికుంటల పునరుద్ధరణ పనులను చేపట్టినట్లు చెప్పారు. మండలకేంద్రంలో అర్హులందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మిస్తామన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని

ప్రతి గ్రామంలో ప్లలె ప్రగతి నిద్ర చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో ఎనలేని ఆత్మవిశ్వాసం నెలకొని ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉన్న విషయాన్ని ప్లలె ప్రగతి కార్యక్రమం ద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు.