పల్లె ప్రగతితో రూపురేఖలు మారాలి

స్వచ్ఛ గ్రామాలు తయారుకావాలి: ఎమ్మెల్యే
ఆదిలాబాద్‌,ఫిబ్రవరి24(జనం సాక్షి): సమష్టి కృషితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ఇందుకోసం పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎమ్మెల్యే జోగురామన్న సూచించారు. గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలసికట్టుగా పనిచేయాలని, గ్రామాల ప్రగతి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. గ్రామాలు ప్రగతిబాటలో పయణించేలా పక్కా ప్రణాళికతో ముందుకుసాగాలని, కనీస వసతుల కల్పన, పరిసరాల పరిశుభ్రత రోడ్లు, మురికికాల్వల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో పల్లెప్రగతి కార్యక్రమం నిర్దేశిత లక్ష్యంతో సాగాలన్నారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం పకడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తున్నదని తెలిపారు. గ్రామాల్లో గుర్తించిన సమస్యలను పూర్తిచేసేందుకు ఈ సమ్మేళనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గ్రామాల్లో పచ్చదనం నెలకునేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గుర్తించిన స్థలాల్లో నర్సరీల పెంపకం చేపట్టి మొక్కలను సిద్ధం చేయాలన్నారు. క్షేత్రస్థాయి ఇబ్బందులను సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలంగాణను ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడం ప్రభుత్వం లక్ష్యమన్నారు. గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటిన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కోరారు.