పశ్చిమ బెంగాల్‌ ఓటర్లు..  భాజపావైపే మొగ్గుచూపుతున్నారు


– బెంగాల్‌ అభివృద్ధికి మమత అడ్డంకిగా నిలిచారు
– భాజపా నాయకుల ర్యాలీలకు అడ్డంకులు సృష్టిస్తున్నారు
– మమత కంటే కమ్యూనిస్టులే మేలు
– భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా
కోల్‌కతా, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : పశ్చిమ బెంగాల్‌ ఓటర్లు భాజపావైపే మొగ్గుచూపుతున్నారని, బెంగాల్‌ అభివృద్ధికి లోక్‌సభ ఎన్నికలు కీలకమని అక్కడిప్రజలు భావిస్తున్నారని భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా అభిప్రాయపడ్డారు. సోమవారం బెంగాల్‌లో పలు ప్రాంతాల్లో ర్యాలీల్లో అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఈ సందర్భంగా మమత సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మమత కంటే కమ్యూనిస్టులే నయం అంటూ వ్యాఖ్యానించారు. రెండు విడతల ఎన్నికలు అనంతరం దేశంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లు భాజపావైపే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొనే ప్రజలు తమ పార్టీకి ఓటు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2022నాటికి దేశానికి స్వాతంత్యం వచ్చి 75సంవత్సరాలు పూర్తవుతుందని.. దీన్ని దృష్టిలో ఉంచుకునే మేనిఫెస్టోలో లక్ష్యాలను నిర్దేశించుకున్నామన్నారు. అలాగే బెంగాల్‌లో పౌరసత్వ నమోదు కార్యక్రమాన్ని కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. భాజపా నాయకుల ర్యాలీలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డంకులు సృష్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తమ పార్టీ సభలకు అనుమతులు నిరాకరిస్తున్నారని గమనించిన ప్రజలు ఆమె ర్యాలీలకు పెద్దగా హాజరుకావడం లేదని అభిప్రాయపడ్డారు. దీదీ కంటే కమ్యూనిస్టు నాయకులే మేలని వ్యాఖ్యానించారు. బెంగాల్‌ రాష్ట్ర అభివృద్ధికి ఈ లోక్‌సభ ఎన్నికలు ఎంతో కీలకమన్నారు. యూపీలో భాజపాకు సీట్లు తగ్గనున్నాయన్న సమాచారంతోనే బెంగాల్‌పై దృష్టి సారించారా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. యూపీలోనూ తమ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్న లక్ష్యంతోనే ఇక్కడ పోరాడుతున్నామని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని, ఆర్టికల్‌ 370 రద్దుపై మమతా బెనర్జీ తన అభిప్రాయాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ పోటీపై స్పందిస్తూ.. హిందూ తీవ్రవాదం పేరుతో ఆమెపై అక్రమ కేసులు బనాయించారన్నారు. కోర్టులు ఆమెను నిర్దోషిగా తేల్చాయన్నారు. అలాగే స్వామి అసీమానందపై కూడా తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు.