పసిడి ధరలు మరింత పైపైకి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): పసిడి ధర మరోమారు పరుగులు పెట్టింది. స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారానికి డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో బుధవారం బులియన్‌ మార్కెట్‌లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.200 పెరిగి రూ.31,400కు చేరింది. అదే సందర్భంలో వెండి ధర తగ్గింది. కిలో వెండి ధర రూ.250 తగ్గి రూ.37,600గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణెళిల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్‌ తగ్గిందని బులియన్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ పెరిగిందని, దీంతో బంగారం ధర కూడా పెరిగిందని మార్కెట్‌ వర్గాలు చెప్తున్నాయి. అలాగే రూపాయితో పోలిస్తే డాలరు విలువ బలపడుతుండడంతో పెట్టుబడిదారులు బంగారం కొనుగోళ్లకు మద్దతు చూపడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగాయి. సింగపూర్‌మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.22శాతం పెరిగి 1193డాలర్లకు చేరింది.

వరుసగా ఆరోరోజూ నష్టాలే

ఇకపోతే స్టాక్ట మార్కెట్లో నష్టాల మోత కొనసాగుతోంది. వరుసగా ఆరో రోజూ సూచీలు కుదేలయ్యాయి. రూపాయి పతనం, ముడి చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు మదుపర్లను కలవరపరిచాయి. ఫలితంగా బుధవారం ఆరంభం నుంచే సూచీలు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. ఈ ఉదయం సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. మదుపర్ల అప్రమతత్తతో కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. రూపాయి భారీగా పతనమవడంతో మరింతగా దిగజారిన సూచీలు ఒక దశలో భారీ నష్టాల్లో ట్రేడ్‌ అయ్యాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ కూడా భారీ నష్టంతో ట్రేడింగ్‌ను కొనసాగించింది. అయితే చివరి గంటల్లో ఆటోమొబైల్‌ రంగాల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సూచీలు కాస్త కోలుకున్నాయి. నష్టాలను తగ్గించుకున్నాయి. బుధవారం మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 140 పాయింట్లు నష్టపోయి 38,018 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 11,477 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పాయింట్లు పతనమై 71.80గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌, టాటామోటార్స్‌, విప్రో, హిందాల్కో, వేదాంతా లిమిటెడ్‌ షేర్లు లాభపడగా.. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హిందుస్థాన్‌ యునిలివర్‌, టైటాన్‌, కొటక్‌ మహింద్రా బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.