పాకాల ఆయకట్టు రైతుల్లో ఆనందం

నీటి నిల్వలతో సాగుకు భరోసా
వరంగల్‌,మే8(జ‌నం సాక్షి): పాకాల సరస్సు పరిధిలో ఈఏడాది రెండు పంటలు పండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గత ఏడు కురిసిని వర్షాలతో పాకాల పూర్తిగా నిండింది.  పండించిన ధాన్యానికి ధర కూడా బాగుండటం వారి ఇంట ఆనందం వెల్లివిరిసింది. ప్రకృతిపరంగా ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుంటే పాకాల ఆయకట్టు ప్లలెలు నిత్యం సస్యశ్యామలంగా ఉంటాయి.పాకాల సరస్సు భావితరాల బంగారు భవితకు బాటలు వేసిన కాకతీయ రాజులు నేటికీ చిరస్మరణీయులుగా నిలిచారు.  తొలకరిలో కురిసే వాన నీటిని గుట్టల మధ్య నుంచి ఒడిసి పట్టి ఒక్క చోటకు చేర్చి పాకాల సరస్సును నిర్మించి భవిష్యత్తు తరాలకు సాగు, తాగు నీటి ఎద్దడిని తీర్చారు. ఇప్పుడది ఊహించనంత సంపద సృష్టిస్తోంది. అన్నదాతలకు రెండు పంటల ద్వారా ధాన్య, ధన రాశులు కురిపిస్తోంది. ప్రతి నీటి బొట్టూ ఓ ధాన్యపు గింజను అందిస్తోంది. నేలపై పడిన నీటిచుక్కను పొదుపుగా చేసి సంరక్షించుకుంటే సిరుల పంటే పండుతుందనేందుకు ఈ సరస్సే ఉదాహరణ. అడవిలో కురిసిన వాన మాత్రం రైతులకు కల్పతరువుగా మారుతోంది. డెల్టాలో మాదిరి పచ్చని పొలాలతో సస్యశ్యామలంగా ఉంటోంది పాకాల ఆయకట్టు. అడవిలో కురిసిన వర్షపు నీరంతా చేరడం ద్వారా 30 అడుగుల లోతున్న పాకాల సరస్సు నిత్యం నీటితో కళకళలాడుతుంటుంది. ఇందులో చేరే నీటితోపాటు, వర్షపు నీటితో మొదటి పంట అయిన ఖరీఫ్‌లో ఎక్కువ పంట చేతికందుతుంది. యాసంగిలో వర్షాలు తక్కువ కావడంతో సరస్సు నీటి ద్వారా సగం పంట మాత్రమే పండించుకోగలుగుతున్నారు. ఇక్కడ చెరువులను పునరుద్దరించడంతో సమస్యలు తీరాయి.