పాకిస్థాన్ అధ్యక్షుడిగా..
నెహ్రూ దంతవైద్యుడి కుమారుడు
– 13వ అధ్యక్షుడిగా ఎన్నిక
– ఈనెల 8 తరువాత బాధ్యతలు స్వీకరించనున్న అల్వీ
ఇస్లామాబాద్, సెప్టెంబర్5(జనం సాక్షి) : పాకిస్థాన్ అధ్యక్షునిగా డాక్టర్ ఆరిఫ్ అల్వీ ఎన్నికయ్యారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ వ్యవస్ధాపక సభ్యుల్లో ఆరిఫ్ అల్వీ ఒకరు. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఆయన తన సవిూప ప్రత్యర్ధి పాకిస్థాన్ ముస్లిం లీగ్ అభ్యర్ధి మౌలానా ఫజర్ ఉర్ రెహమాన్‌ను ఓడించి పాకిస్థాన్‌కు 13వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పాక్ జాతీయ అసెంబ్లీకి 430 మంది సభ్యులు వేసిన ఓట్లలో అల్వీకి 212, రెహమాన్‌కు 131 ఓట్లు పోలయ్యాయి. అల్వీ 1947లో కరాచీలో జన్మించారు. భారత మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు దంతవైద్యుడిగా పనిచేసిన డాక్టర్ హబిబ్ ఉర్ రెహ్మాన్ ఇలాహి అల్వీ కుమారుడు కావడం విశేషం. అల్వీ పూర్వీకులు ఆగ్రాలో నివాసం ఉండేవారు. దేశ విభజన సమయంలో వారు పాకిస్థాన్‌కు వలసవెళ్లి కరాచీలో స్థిరపడ్డారు. డాక్టర్ హబిబ్ అక్కడే మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. తండ్రి నుంచి వైద్యవృత్తిని వారసత్వంగా తీసుకున్న అల్వీ కూడా డెంటిస్ట్‌గానే కొనసాగారు. తదనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. వృత్తిరీత్యా దంత వైద్యుడైన ఆరిఫ్ అల్వీ ప్రస్తుత అధికార పార్టీ అయిన పీటీఐ వ్యవస్ధాపకుల్లో ఒకరు. ఆయన 2006 నుంచి 2013 వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇటీవల జరిగిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కరాచీ నుంచి గెలుపొందారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు కూడా. ప్రస్తుత అధ్యక్షుడు మామ్నూన్ హుస్సెన్ పదవీ కాలం సెప్టెంబరు 8తో ముగియనుంది. అనంతరం పాకిస్థాన్‌కు 13వ అధ్యక్షుడిగా అల్వీ బాధ్యతలు చేపడతారు. ప్రధాన మంత్రి చేసే సిఫారసులన్నింటిపై అధ్యక్షుడికి నిర్ణయం తీసుకునే అధికారాలుంటాయి.