పాక్‌కు గుణపాఠం తప్పదు 

– తమకేవిూ సంబంధం లేదని పాక్‌ చెత్తగా వాగుతోంది
– కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌
శ్రీనగర్‌, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి) : పాకిస్థాన్‌కు గుణపాఠం తప్పదని, తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జమ్మూకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు సృష్టించిన మారణ ¬మాన్ని కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్‌ చెప్పడం దారుణమని మండిపడ్డారు. ఎన్నికలు ముగిసిన అనంతరం పాకిస్తాన్‌ నిరాశలో మునిగిపోయిందని, కొత్త ఉగ్రవాదులకు వల పన్నడం వీలు కాకపోవడం వల్లే తమ ఉనికిని చాటుకునేందుకు ఈ దారుణానికి తెగబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ చెత్తగా వాగుతోందని, ఉగ్రవాదులు నిర్భయంగా ర్యాలీలు చేసుకునేందుకు అనుమతినిస్తూ, మేమైనా చేయగలమనే అహంకారంతో భారత్‌ను బహిరంగంగానే హెచ్చరించాలని చూస్తోందని మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో పాక్‌ ఎన్నోరోజులు మనుగడ సాగించలేదని హెచ్చరించారు. పాకిస్థాన్‌కు తగిన రీతిలో బుద్దిచెబుతామని, అందుకు పాక్‌ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఉగ్రవాద సంస్థలను ఇంట్లో పెట్టుకొని, భారత్‌పైకి ఉసిగొల్పుతుందని, ఈ ఘటనలను ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఖండిస్తున్నాయని అన్నారు. కాశ్మీర్‌లో అల్లర్లు సృష్టించి భారత్‌ను విచ్ఛిన్నం చేయాలని చూసే పాక్‌ ఆటలు ఇక సాగవని అన్నారు. అమర జవానుల సంస్మరణ సభకు హాజరవుతున్నానని తెలిపారు. తనతో పాటు కేంద్ర ¬ం మంత్రి రాజ్‌రాథ్‌ సింగ్‌ కూడా కశ్మీర్‌ వస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భద్రతా, ఇంటలెజిన్స్‌ వర్గాలతో భేటీ అయి, ఘటనకు గల కారణాల గురించి చర్చిస్తామని పేర్కొన్నారు. కాగా గురువారం పుల్వామాలో ఉగ్రవాదులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. అవంతిపొరా పట్టణం సవిూపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న ఓ బస్సు తునాతునకలు కాగా, కాన్వాయ్‌లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.