పాక్‌తో సుధీర్ఘచర్చలకు..  భారత్‌ సిద్ధంగా ఉండాలి


– ఒక్క మెరుపుదాడితో పాక్‌ మారిపోదు
– మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ హూడా
న్యూఢిల్లీ, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : ఒక్క మెరుపు దాడితో పాకిస్థాన్‌ తన ప్రవర్తనను మార్చుకుంటుందనుకోవడం పొరపాటని మాజీ ఉత్తర ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ హుడా అన్నారు. రెండేళ్ల క్రితం పాకిస్థాన్‌పై భారత్‌ చేసిన మెరుపు దాడులను ఎవరూ మర్చిపోలేరు. ఆ ప్రతీకార చర్యలకు సూత్రధారి హూడా మరోసారి ఆ దాడుల గురించి మాట్లాడారు. పాకిస్థాన్‌తో చర్చలు జరపడం వ్యూహంతో కూడుకున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ చర్చావేదికలో పాల్గొన్న ఆయన భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న పరిస్థితులపై మాట్లాడారు. ఒక్క  మెరుపు దాడితో పాకిస్థాన్‌ తన ప్రవర్తనను మార్చుకుంటుందనుకోవడం పొరపాటంటూ.. పాకిస్థాన్‌ను సరైన గాడిలో పెట్టాలంటే ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుందని అన్నారు. సరైన వ్యూహాలతో ముందుకెళ్లాలన్నారు. కశ్మీర్‌లో మునుపటి కంటే జాతి వాదం, ఉద్రేకం పెరిగిపోతున్నాయన్నారు. రెండు ప్రాంతాలను చూసుకుని దీనిపై చర్చించాలన్నారు.  కశ్మీర్‌ విషయంలో పాక్‌ జోక్యం ఎంతో ప్రమాదకరమని, అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుందని తెలిపారు. ఇక భారత్‌ కూడా జమ్ముకశ్మీర్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేదని, కాబట్టి పాక్‌తో దీర్ఘకాలిక చర్చలకు మన దేశం సిద్ధంగా ఉండాలని హుడా అభిప్రాయపడ్డారు.