పాక్‌పై దాడిచేసే దైర్యంగల ప్రధాని కావాలి

– మోదీకి అలాంటి లక్షణాలున్నాయి
– అందుకే భాజపాతో పొత్తు పెట్టుకున్నాం
– శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే
ఔరంగాబాద్‌, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : పాక్‌లాంటి శత్రుదేశాలపై దాడి చేయగలిగే ధైర్య సాహసాలు ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి కావాలని, ఆ లక్షణాలు మోదీలో ఉన్నాయని, దీంతోనే భాజపాతో పొత్తు కుదుర్చుకున్నామని శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా భాజపాపై అనేక ఆరోపణలు చేసిన శివసేన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అనూహ్యంగా అదే పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల ప్రచారం సందర్భంగా దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ పాక్‌కు దీటైన సమాధానం చెప్పగలిగే వ్యక్తి కోసమే భాజపాతో కలిసి నడుస్తున్నామన్నారు. అలాగే పొత్తు సమయంలో మహారాష్ట్ర ప్రయోజనాలనూ పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌పైనా ఉద్దవ్‌ ఠాక్రే విరుచుకుపడ్డారు. ఆర్టికల్‌ 370 రద్దుకు ఆ పార్టీ అంగీకరించడం లేదన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న చట్టాలే జమ్మూకశ్మీర్‌లోనూ అమలు కావాలన్నది తమ పార్టీ నిర్ణయమన్నారు. అలాగే ముస్లిం సోదరులు తమ శత్రువులేం కాదంటూ పరోక్షంగా ఎంఐఎంపై విమర్శలు గుప్పించారు. భాజపా-శివసేన పొత్తును ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్దవ్‌ స్పందిస్తూ..గతంలో కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన పవార్‌.. తిరిగి ఆ పార్టీతో కలవనని శపథం చేశారని గుర్తుచేశారు. కానీ ఆ తరవాత ఆయన రెండు సార్లు కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకొన్నారన్నారు. అలాంటి నేత శివసేనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్రలో ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు పూర్తవగా.. మరో రెండు దశల్లో పోలింగ్‌ జరగనుంది.