పాక్‌ ఉగ్రవాదాన్ని ఎండగట్టిన భారత్‌

సార్క్‌ సదస్సులో తీవ్రంగా స్పందించిన సుష్మాస్వరాజ్‌
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎండగట్టాలని పిలుపు
న్యూయార్క్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ): పాక్‌ ఉగ్ర చర్యలను భారత్‌ మరోమారు ఎండగట్టింది. ఈ ప్రాంతంలో పాక్‌ ఉగ్రవాదం తీవ్ర ముప్పుగా పరిణమించిందని  శాంతి, భద్రతలకు ఉగ్రవాదం పెనుముప్పని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 73వ ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ‘సార్క్‌’ మంత్రులతో జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి సుష్మాస్వరాజ్‌ మాట్లాడుతూ, దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతకు ఉగ్రవాదం ఇప్పటికీ పెనుముప్పుగానే ఉందని, ఆ ప్రాంతంలో ఉగ్రవాద ఘటనలు పెరుగుతూనే ఉన్నాయని పరోక్షంగా పాకిస్థాన్‌ను తప్పుపట్టారు. ఉగ్రవాదం దక్షిణాసియాకే కాదు, దేశానికే ముప్పు అని అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎలాంటి వివక్షా లేకుండా తుదముట్టించాల్సిన బాధ్యత సార్క్‌ దేశాలపై ఉందని సూచించారు. సార్క్‌ గ్రూప్‌లో ఇండియా, పాకిస్థాన్‌, మరో ఆరు దేశాలున్నాయి. దక్షిణాసియా ప్రజల సంక్షేమానికి కృషి చేసేందుకు 1985లో ఇది ఏర్పడింది. కాగా, సార్క్‌ మంత్రుల సమావేశంలో సుష్మాస్వరాజ్‌ చేసిన ప్రసంగంపై పాక్‌ విదేశాంగ మంత్రి షా మెహమూద్‌ ఖురేషి స్పందిస్తూ, సార్క్‌ ప్రగతి విషయంలో పాక్‌ వెనుకంజ వేసేది లేదని, అయితే సార్క్‌ స్ఫూర్తిని ఒక దేశ వైఖరి గండికొడుతోదని, అందువల్ల సార్క్‌ వ్యవస్థాపకుల ఆశయాలు అసంపూర్తిగానే మిగిలిపోతున్నాయని భారత్‌ వైఖరిపై పరోక్ష విమర్శలు చేశారు. రీజినల్‌ నేషన్స్‌ అంతా ఒకచోట సమావేశమైనప్పుడు చర్చలు,
సంభాషణలకు తావీయకుండా ప్రాంతీయ సహకారం ఎలా సాధ్యమవుతుందో తనకు అర్ధం కావడం లేదన్నారు. సమావేశంలో సుష్మాస్వరాజ్‌తో మాట్లాడారా అని అడిగినప్పుడు, ఆమె సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారని, బహుశా ఒంట్లో బాగోలేక వెళ్లిపోయి ఉండవచ్చని ఖురేషి జవాబిచ్చారు.