పాక్ భవిష్యత్తు మాకు ముఖ్యం
– సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్
– పాక్లో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం
ఇస్లామాబాద్, ఫిబ్రవరి18(జనంసాక్షి) : పాకిస్తాన్కు ఆర్ధికంగా ఊతమిచ్చేలా సౌదీ అరేబియా 20 బిలియన్
డాలర్ల విలువైన ఓ భారీ ఒప్పందంపై సంతకాలు చేసింది. రిఫైనింగ్, పెట్రో కెమికల్ రంగాలు సహా… క్రీడారంగంలో సహకారం, సౌదీ వస్తువుల దిగుమతి, విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు, ఇంధన ప్రాజెక్టులు సహా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పాక్తో సౌదీ ఒప్పందాలు చేసుకుంది. తమ ‘సోదర దేశమైన’ పాకిస్తాన్ ఆర్ధిక భవిషత్తు తమకు చాలా ముఖ్యమని ఈ సందర్భంగా సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ పేర్కొన్నారు. తమ ప్రాంతం పట్ల తమకు విశ్వాసం ఉందనీ.. అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు. దక్షిణాసియా, చైనా పర్యటనలో భాగంగా ఆయన తొలుత పాకిస్తాన్లో అడుగుపెట్టారు. ఆదివారం రాత్రి రావిల్పిండి మిలటరీ విమానాశ్రయంలో దిగిన సౌదీ రాజుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా ఘన స్వాగతం పలికారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలోనే ఆయన పాకిస్తాన్ రావడం గమనార్హం. కశ్మీర్లోని పుల్వామాలో ఓ సూసైడ్ బాంబర్ ఇటీవల 40 మంది భారత జవాన్లను పొట్టన బెట్టుకున్న నేపథ్యంలో… సౌదీ రాజు పాక్ పర్యటనకు ప్రాధాన్యం చేకూరింది. పుల్వామా దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందనీ, దాయాది దేశానికి గుణపాఠం తప్పదని భారత్ చెబుతుండగా… ఈ దాడితో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయిస్తోంది. కాగా సౌదీ రాజు తన పర్యటనలో భాగంగా ఇండోనేసియా, మలేషియా కూడా వెళ్లాల్సి ఉండగా… ప్రస్తుతం ఆ దేశాలకు వెళ్లేందుకు ఆయన వెనక్కి తగ్గినట్టు సమాచారం. అయితే ఆయన పర్యటన ఎందుకు వాయిదా పడిందన్న దానిపై అక్కడి అధికారులకు వద్ద ఎలాంటి సమాచారం లేదు. పాకిస్తాన్లో పర్యటించిన అనంతరం సౌదీ రాజు భారత్కు రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరపనున్నారు.