పాత్రికేయులు వినూత్న నిరసన

– బీజేపీ సమావేశానికి హెల్మెంట్‌లతో వెళ్లిన విలేకరులు
రాయ్‌పూర్‌, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : చత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో అక్కడి విలేకరులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల బీజేపీ నేతలు పలువురు విలేకరులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ.. బీజేపీ ఏర్పాటు చేసిన సమావేశానికి హెల్మెంట్‌లతో హాజరై నిరసన తెలిపారు. గతవారం బీజేపీ విూడియా సమావేశానికి హాజరైన ఒక విలేకరిపై ఆ పార్టీ మద్దతుదారులు దాడి చేయడంతో వారు ఈవిధంగా నిర్ణయం తీసుకున్నారు. తాము ఒక సందేశాన్ని బీజేపీకి చేరేలా ఇటువంటి నిరసనకు దిగామని జర్నలిస్టులు తెలిపారు. అదేవిధంగా మరోసారి దాడి చేస్తే హానీ జరగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. గత శనివారం ఓ విూడియా సమావేశంలో పాల్గొన్న ద వాయిసెస్‌ జర్నలిస్టు సుమన్‌ పాండేపై జిల్లా స్థాయికి చెందిన బిజెపి నేతలు దాడి చేశారు. ఈ ఘటనలో అతడి తలకి గాయమైంది. దీంతో రాయ్‌పూర్‌ పార్టీ చీఫ్‌ రాజీవ్‌ అగర్వాల్‌తో సహా నలుగురిపై జరల్నిస్టులు ఫిర్యాదు చేశారు. గాయపడ్డ విలేకరి తెలిపిన వివరాల ప్రకారం ‘సమావేశాన్ని మేం ఫోన్లలో రికార్డు చేస్తుండగా… కొందరు భాజపా నేతల మధ్య ఏదో విషయమై వాగ్వాదం జరిగింది. అది కూడా మా ఫోన్లలో రికార్డయ్యింది. దాన్ని డిలీట్‌ చేయమని రాజీవ్‌తో పాటు మరో నేతల మాపై ఒత్తిడి తెచ్చారు. తాము తిరస్కరించడంతో నాపై దాడి వీడియోను తొలగించారని’ పాండే వెల్లడించారు.