పారిశుద్య లోపం వల్లనే అంటువ్యాధులు

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

వరంగల్‌,జూలై12(జ‌నం సాక్షి): జ్వరాలు విజృంభించటానికి పారిశుద్ధ్య లోపం, మురుగు, వర్షం నీరు నిల్వ ఉండడమే ప్రధాన కారణం. వాతావరణ మార్పులతో విషజ్వరాలు వ్యాపించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇటీవల కురుస్తున వర్షాలకు గ్రామాల్లో పెద్ద ఎత్తున మురుగు నిల్వ ఉంటోంది. ఎక్కడిక్కడ మురుగునీటి ఉద్ధృతి వల్ల విపరీతంగా దోమల సంఖ్య పెరుగుతోంది. గ్రామాల్లో సరైన పారిశుద్ధ్య వ్యవస్థ లేక

ఇళ్ల సముదాయాల్లోనే పెద్దఎత్తున మురుగు నిల్వ ఉంటోంది. ఇళ్లలో వాడకంలో లేని రోళ్లు, పాత వస్తువులు, డబ్బాలు, ప్లాస్టిక్‌ సామాన్లు, పాత మోటారు సైకిళ్లు, కార్ల టైర్లు, కొబ్బరి బొండాలను ఆవాసాలుగా చేసుకుని దోమలు వృద్ది చెందుతున్నాయి. దోమల నివారణకు పంచాయతీలు ఎబెట్‌ను పిచికారి చేసినా, ప్రజలు మస్కిటో కాయిల్స్‌, శరీరానికి రాసుకునే క్రీములు, ఎలక్టాన్రిక్‌ వస్తువులు వాడుతున్నా ప్రయోజనం ఉండడం లేదు. ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న మురుగు నీటిలో కిరోసిన్‌, మడ్డి ఆయిల్‌ గానీ వేస్తే దోమల లార్వాలకు గాలి, వెలుతురు అందక అవి చనిపోతాయి. నీటితో నిల్వ ఉన్న పాత్రలను, తొట్టెలను శుభ్రపరిచి పూర్తిగా ఎండబెట్టుకోవాలి.అలాగే గ్రావిూణ ప్రాంత ప్రజలు దోమతెరలు తప్పక వాడాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో వేప, గానుగ, తులసి ఆకులతో రోజూ సాయంత్రం పొగబెట్టాలి. నాలుగైదు రోజులు ఇలా చేస్తే ఇంటి పరిసరాల్లోకి దోమలు రాకుండా ఉంటాయి. ఇంటి పరిసరాల్లో ఉసిరి, నిమ్మజాతి మొక్కలను పెంచడం వల్ల దోమలు ఇంటి వైపు రావు.ఇంట్లో సంపులు, నీరు నిల్వఉన్న ట్యాంకుల్లో కొత్తివిూర మొక్కలను గుడ్డలో కట్టి నీటిలో మునిగేలా ఆరు గంటలు ఉంచితే ఆ నీటిలోని వంద శాతం బ్యాక్టీరియా చనిపోతుంది. డెంగీ, చికున్‌ గన్యా కలిగించే ఎడిస్‌ ఈజిప్టు దోమలు మంచినీటిలో గుడ్లను పెడతాయి. వాడి పడేసిన డబ్బాలు, వస్తువులు, సామాన్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. పూజలో వాడే ముద్ద కర్పూరాన్ని ఒక గిన్నెలో నీరు పోసి పంకా గాలి కింద పెడితే దోమలు పారిపోతాయి. నాలుగు వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి వాటిని లీటరు నీటిలో కలిపి గదిలో పిచికారి చేసుకుంటే దోమలు ఇంట్లోకి రావు.వర్షాల కారణంగా పారిశుధ్యం లోపించడంతో పాటు తాగుబావుల్లోకి కొత్తగా నీరు వచ్చి చేరడంతో తాగునీటి జలాలు కలుషితంగా మారుతాయి. గ్రామాల్లో కాలువలు, నీటి గుంటలు, ఇతర ప్రాంతాల్లోని నీరు నిలువడంతో దోమలు క్రిమి,కీటకాలు వ్యాపించి వివిధ వ్యాధులకు కారణమవుతాయి. ఈ సీజన్‌లో మలేరియా, టైఫాయిడ్‌, డయోరియా, చికున్‌గున్యా లాంటి వ్యాధులు ఇక్కడి ప్రజలపై ప్రభావం చూపుతాయి. గిరిజన ప్రాంతాల్లో నాలుగేళ్లుగా ఈ వ్యాధులను నివారించడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.

————–