పారిస్‌లో భారీ అగ్నిప్రమాదం 


– నివాస భవనంలో చెలరేగిన మంటలు
– ఎడుగురు మృతి, మరికొందరికి గాయాలు
పారిస్‌, ఫిబ్రవరి5 (జ‌నంసాక్షి) : ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ 8 అంతస్తుల నివాస భవనంలో మంటలు చెలరేగి ఏడుగురు మృతిచెందారు. పారిస్‌లోని 16వ అరోన్‌డిసెమెంట్‌లో గల రు ఎర్లాంగర్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రు ఎర్లాంగర్‌లోని ఓ నివాస భవనంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే భవనమంతా మంటలు వ్యాపించాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలు అదుపుచేసేందుకు యత్నించారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఏడుగురు సజీవదహనమయ్యారు. మరో 28 మందిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. ఇంకొంత మంది మంటల్లో చిక్కుకొని తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయకచర్యలు చేపట్టారు. దాదాపు 200 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొన్నారు. 7, 8వ అంతస్తులో మంటలు తీవ్రంగా ఉండటంతో పక్కనే ఉన్న భవనాలను కూడా అధికారులు ఖాళీ చేయించారు. కాగా తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మరికొంత మంది మంటల్లో చిక్కుకొని ఉంటారని అక్కడి అధికారులు భావిస్తున్నారు. కాగా కోసం సహయక చర్యలు చేపట్టారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే
అవకాశమున్నట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు.