పార్లమెంట్‌ గేటును ఢీకొట్టిన ఎంపి కారు

అప్రమత్తం అయిన సెక్యూరిటీ సిబ్బంది
న్యూఢిల్లీ,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ గేటును ఓ ఎంపీ కారు రు ఢీకొనడంతో బారికేడ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో పార్లమెంట్‌ పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. సెక్యూర్టీని హుటాహుటిన పెంచేశారు. పార్లమెంట్‌ గేటును ఢీకొట్టిన కారు.. మణిపూర్‌కు చెందిన ఎంపీ డాక్టర్‌ దొక్‌చమ్‌ మేన్యాదిగా గుర్తించారు. ఈ ప్రమాదం పట్ల పార్లమెంట్‌ సెక్యూర్టీ విచారణ ప్రారంభించింది. రాంగ్‌ రూట్లో కారు పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. డీఎల్‌ 12 సీహెచ్‌ 4897 రిజిస్టేష్రన్‌  నెంబర్‌. ఆ కారుకు ఎంపీ స్టిక్కర్‌ ఉంది. అయితే సెక్యూర్టీ లోపం ఎలా జరిగిందన్న కోణంలో విచారణ ప్రారంభించారు. ఎగ్జిట్‌ గేటు నుంచి కారు లోపలికి వచ్చేందుకు ప్రయత్నించింది. 2001లో పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి చేసిన విషయం తెలిసిందే. లష్కరే, జైషే సంస్థలకు చెందిన ఉగ్రవాదులు ఆ దాడి చేశారు. ఆ దాడిలో 9 మంది చనిపోయారు. ఏకే47 రైఫిళ్లు, గ్రేనేడ్లు, పిస్తోళ్లతో వచ్చిన అయిదుగురు ఉగ్రవాదులను ఆ తర్వాత భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఆ తరవాత నుంచి పోలీసులు హై అలర్ట్‌గా ఉంటున్నారు. ఏ చిన్న ఘటన జరిగినా లోతుగా విచారిస్తున్నారు. సెక్యూర్టీ క్లియరెన్స్‌ లేకుండా కారు పార్లమెంట్‌లోకి ప్రవేశించడంతో అక్కడ భద్రతను అప్రమత్తం చేశారు.