పాలకుర్తికి పర్యాటక శోభ

సిఎం హావిూతో మారనున్న రూపురేఖలు
జనగామ,మే114(జ‌నం సాక్షి):  సిఎం కేసీఆర్‌ హావిూతో పాటు నిధుల విడుదలతో  దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న బమ్మెర పరిసర చారిత్రక ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా మారనున్నాయి.  స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు కూడా దగ్గరుండి అభివృద్దికి చర్యలకు పూనుకున్నారు.  ప్రజాప్రతినిధులు, పోతన ట్రస్ట్‌ స్థల దాతలు చొరవ చూపుతున్నారు. ప్రాథమికంగా పోతన స్మారక కేంద్రం అభివృద్ధి కోసం రూ.5 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. మరిన్ని అభివృద్ధి పనులు చేయాలంటే రూ.40 కోట్ల అవసరమని అధికారులు తెలిపారు. వాటి మంజూరు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మహాకవులు, కళాకారులు, పోరాటయోధులకు పుట్టినిల్లు జనగామ జిల్లా బమ్మెర, వల్మిడి ప్రాంతాలు. సహజకవి పోతన జన్మస్థలమైన బమ్మెర.. పాలకుర్తికి మూడు కిలోవిూటర్ల దూరంలో ఉంది. సాహిత్యంలో పోతన భాగవతానికి నేటికీ విశిష్ఠ స్థానం ఉంది. పోతనతో ముడిపడిన చారిత్రక ఆనవాళ్లు స్థానికంగా నేటికీ దర్శనమిస్తున్నాయి. ఆయన ఉపయోగించిన బావి శిథిలావస్థకు చేరింది. ఆయన సమాధి నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. బావి పక్కనే ఉన్న లక్కమాంబ వాగు విస్తీర్ణం రోజురోజుకూ తగ్గిపోతోంది. పోతన శివున్ని ఆరాధించిన శివాలయం శిథిలావస్థకు చేరింది. 1982లో నిర్మించిన పోతన మందిరం అంతంత మాత్రంగా ఉంది. పోతన రచనలు చేసిన బండరాయి ఇతర ప్రదేశాలు ఆనవాళ్లు శిథిలమవుతున్నాయి. వీటిని పరిశీలించిన అధికారులు, ప్రజాప్రతినిధులు బమ్మెర చారిత్రక ప్రదేశాలను రక్షించి అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఏడాది కిందట ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో పోతన స్మారక అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు పలుమార్లు వచ్చి చారిత్రక ప్రాంతాలను సందర్శించి ఆరు నెలలకిత్రం ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అదే సమయంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, కమిటీ సభ్యులతో కలిసి పోతన స్మారక కళాక్షేత్ర నమునా ఆవిష్కరించారు. కలెక్టర్‌ శ్రీదేవసేన, ప్రభుత్వ సలహాదారు పాపారావు పలుమార్లు బమ్మెర, పాలకుర్తికొచ్చి చారిత్రక ప్రాంతాలను
సందర్శించి పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. పాల్కురికి సోమనాథ మహాకవి జన్మస్థలం పాలకుర్తి. ఈయన తెలుగు, సంస్కృతం, కన్నడంలో రచనలు చేశారు. తెలుగు సాహిత్యంలో పలు పక్రియలకు సోమన ఆద్యుడు. పాలకుర్తి నుంచి అయిదు కి.విూ. దూరంలో వల్మిడి ఉంది. ఇక్కడ
మునులగుట్ట, రాముల గుట్ట ఉన్నాయి. వల్మిడి మహర్షి తపమారించిన ప్రదేశంగా ఈ ప్రాంతానికి విశిష్ఠత ఉంది. రాములు గుట్టపై ఉన్న జీడి, పాలగుండాలకు విశేష ప్రాధాన్యముంది. గుట్టపైన సీతారాముల ఆలయం, పాలగుండం ఉన్నాయి. రాముల గుట్ట, మునుల గుట్ట లవకుశుల జన్మస్థలమని ప్రచారంలో ఉంది. పాలకుర్తిని పర్యాటక వలయంగా తీర్చిదిద్ది పర్యాటక విడిది కేంద్రాలు, కళాక్షేత్రం ఇతర ఆహ్లాదకరమైన నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇటీవల సిఎం పర్యటించి అనేక  అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈప్రాంత అభివృద్దికి హావిూఇచ్చారు. దీంతో ఇక ఈ ప్రాంతంపర్యాటకంగా అభివృద్దిచెందనుంది.
……………………….