పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఏదీ?

` ఇది పాలమూరు ప్రజలను వంచించడమే
` రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రధాని మోడీ పాలమూరు పర్యటనలో కృష్ణాజలాలలో తెలంగాణ వాటాపై ఎందుకు మాట్లాడలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఒక ప్రకటనలో ప్రశ్నించారు ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల ప్రచార హావిూ మోసపూరితమేనా? అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ప్రకటించక పోవడం పాలమూరు ప్రజలను వంచించడమేనని కృష్ణాజలాలలో తెలంగాణ వాటా గురించి ప్రధాని ఎందుకు మాట్లాడలేదని అన్నారు. రూ.13,500 కోట్ల టోల్‌ రహదారులు ఏ ప్రజల ప్రయోజనాల కోసం అని అడిగారు. బీజేపీ హయాంలో రహదారుల విూద టోల్‌ వసూలు సామాన్య ప్రజలకు భారంగా మారిందన్నారు. టోల్‌ ట్యాక్స్‌ వసూలు చేసే రహదారులు నిర్మించి అభివృద్ది చేశామని గొప్పలు చెప్పుకోవడం ఆశ్చర్యకరమన్నారు. బీహార్‌ ఎన్నికలలో చేసిన ప్రధాని లక్షన్నర కోట్ల హావిూలకు ఇంత వరకు దిక్కు లేదన్నారు. 2019 ఎన్నికల పసుపు బోర్డు హావిూ విూకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?అని ఎద్దేవా చేశారు. మోసపూరిత హావిూల్లో మోడీది అందెవేసిన చేయ్యి అని పాలమూరుకు వచ్చి పసుపుబోర్డు, గిరిజన విశ్వవిద్యాలయం ప్రకటించడం బీజేపీ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. వీటివల్ల పాలమూరు జిల్లాకు కలిగే ప్రయోజనాలు ఏమిటన్నారు.పాలమూరు రంగారెడ్డిని విస్మరించడం తెలంగాణ బీజేపీ నేతల అసమర్థతకు నిదర్శనమని, పాలమూరు ప్రజలకు బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పాలమూరు ప్రయోజనాలు కాపాడలేని బీజేపీ నేతలు వెంటనే పార్టీకి రాజీనామా చేయాలని ధ్వజమెత్తారు.