పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ మరింత సులువు

పోలీసుల అతిపై విదేశాంగశాఖ మార్గదర్శకాలు

న్యూఢిల్లీ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): పాస్‌పోర్టుల జారీలో పోలీసుల తనిఖీల్లో వస్తున్న ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని వివరాల సేకరణను కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మరింత సరళతరం చేసింది. ఇకనుంచి కేవలం వారు భారతీయులా కాదా అన్నది మాత్రమే తెలుసుకుంటారు. తనిఖీల పేరిట దరఖాస్తుదారు ఇంటికెళ్లి వివరాలు పరిశీలన చేసే సందర్భంలో కొంతమంది పోలీసులు.. అభ్యర్థులను అనవసరంగా ఇబ్బందులు పెడుతున్నారని, ఏ చిన్నపాటి తేడాలున్నా వాటిని సాకుగా చూపి వసూళ్లకు పాల్పడు తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం పోలీసు తనిఖీ పక్రియను సరళీకరించింది. వాటిని తప్పనిసరిగా పాటించేలా చూడాలని పాస్‌పోర్టు కార్యాలయ అధికారులను ఆదేశించింది.అసలు దరఖాస్తుదారుతో, వారి తల్లిదండ్రులతో పోలీసులు మాట్లాడాల్సిన అవసరం లేదు. వారి ఇంటికీ వెళ్లనక్కర్లేదు. అభ్యర్థులు రిఫరెన్స్‌ చిరునామాలను, ఫోన్‌ నెంబర్లను ఇవ్వాల్సిన అవసరం లేదు.

దరఖాస్తులో పేర్కొన్న చిరునామాలో సంవత్సరం నుంచి ఉంటున్నాడా? లేదా? అన్నది కూడా నిర్థరించుకోనవసరం లేదు. పోలీసులు కేవలం దరఖాస్తుదారుపై పోలీసు కేసులు ఏమైనా ఉన్నాయా? లేవా? భారతీయుడా? కాదా? అన్న విషయాల్ని ధ్రువీకరిస్తే చాలని.. మిగిలిన అంశాలు తాము చూసుకుంటామని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఈ విషయాలకు సంబంధించి జూన్‌లోనే విదేశాంగశాఖ ఆదేశాలిచ్చింది. అయినా, పోలీసులు పాతపద్ధతుల్లోనే తనిఖీ విధానాన్ని కొనసాగిస్తుండటంతో పలువురు విదేశాంగశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ మంత్రిత్వశాఖ అధికారులు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాస్‌పోర్ట్‌ కార్యాలయాల ఉన్నతాధికారులకు లేఖలు రాస్తున్నారు. పోలీసులు అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి ఎలాంటి తనిఖీలు చేయాల్సిన అవసరం లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఆమేరకు పోలీసు అధికారులకు నూతన నిబంధనలను వివరిస్తామని పేర్కొన్నారు. దీంతో వివరాల సేకరణ మరింత సులువు కానుంది.