పిట్స్‌బర్గ్‌లో వైభవంగా శ్రీనివాస కల్యాణం

రెండ్రోజులపాటు వైభవంగా ఆగమ సదస్సు

తిరుపతి,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): టిటిడి ఆధ్వర్యంలో అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో గల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. ఈ కల్యాణోత్సవంలో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైందవ ధర్మ పరిరక్షణతోపాటు సమాజంలో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక విలువలను కూడా టిటిడి ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా దేశ విదేశాల్లో భక్తులకు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని కనులారా వీక్షించే భాగ్యాన్ని శ్రీనివాస కల్యాణాల ద్వారా టిటిడి కల్పిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చి స్వామివారి కల్యాణోత్సవ సేవలో పాల్గొనలేని భక్తులకు ఈ కల్యాణాలు విశేష ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి. ముందుగా వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ చేశారు. ఆ తరువాత అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్తోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తిపరవశంతో పులకించారు. ఆలయంలో రెండు రోజుల పాటు జరిగిన ఆగమశాస్త్ర సదస్సు కూడా ఘనంగా ముగిసింది. ఆచారాలలో వేదాల ఔచిత్యం అనే అంశంపై కె.పురుషోత్తమాచార్యులు , ఉత్సవవిధి అంశంపై కె.శ్రీనివాసాచార్యులు , ప్రతిష్ట – సంప్రోక్షణ అంశంపై కె.హెచ్‌.రాజేష్‌ కుమార్‌ మాట్లాడారు. ఇందులో తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఆగమశాస్త్రబద్ధంగా పూజలు నిర్వహణ కోసం టిటిడి ఆగమ పండితులు పలు సూచనలు చేశారు. ఆగమశాస్త్రాన్ని మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు పేర్కొన్నారు. సదస్సులో టిటిడి తిరుపతి జెఇఓ పోల భాస్కర్‌, డెప్యూటీ ఇఓ గౌతమి, ఆగమ పండితులు శ్రీనివాసాచార్యులు, పురుషోత్తమాచార్యులు, శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్వాహకులు సుబ్బారెడ్డి, విజయ్‌ రెడ్డి, సుబ్బారావు చెన్నూరి, వేంకటాచారి,

అమెరికాలోని పలు రాష్ట్రాల్లో గల పలు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల అర్చకులు పాల్గొన్నారు.