పుంజుకున్న స్టాక్‌ మార్కెట్లు

– లాభాలతో ముగింపు
ముంబయి, జులై17(జ‌నం సాక్షి) : ద్రవ్యోల్బణం సెగతో క్రితం సెషన్‌లో నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు మంగళవారం పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడటంతో దేశీయంగా మదుపర్లు కొనుగోళ్ల బాటపట్టారు. దీంతో మంగళవారం నాటి మార్కెట్‌ ఆద్యంతం సూచీలు లాభాల్లో సాగాయి. సెన్సెక్స్‌ దాదాపు 200 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మళ్లీ 11వేల మార్క్‌ దాటింది. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలతో ఈ ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభపడింది. ఆ తర్వాత కూడా లాభాలతో కొనసాగిన సూచీలు చివరి గంటల్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మరింత పుంజుకున్నాయి. బ్యాంకింగ్‌, చమురు రంగ షేర్ల అండతో దూసుకెళ్లాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 196
పాయింట్లు ఎగబాకి 36,520 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 71 పాయింట్ల లాభంతో 11,008 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.38గా కొనసాగుతోంది.
ఎన్‌ఎస్‌ఈలో హిందుస్థాన్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం, హిందాల్కో, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడగా.. హిందుస్థాన్‌ యునిలివర్‌, ఎయిర్‌టెల్‌, రెడ్డీస్‌ ల్యాబ్స్‌, టెక్‌ మహింద్రా, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు నష్టపోయాయి.
———————————