పుకార్లను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు: జనగామ ఏసీపీ 

జనగామ,మే28(జ‌నం సాక్షి): జిల్లాలో శాంతిభద్రతల పరంగా ఏలాంటి ఇబ్బంది లేదని, ఎక్కడా దొంగలు, పార్ధీ, బీహార్‌ ముఠా సభ్యుల సంచారంపై సమాచారం లేదని జనగామ ఏసీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి  అన్నారు. వందతులను నమ్మవద్దన్నారు. ఇటీవల నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో పదేపదే చెప్పాల్సి వస్తోందన్నారు. జనగామ ప్రాంతంలో పార్థీ, బీహార్‌ గ్యాంగ్‌లు సంచరిస్తున్నాయని వస్తున్న పుకార్లు, వదంతులను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేందుకు కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. తమ పరిధిలో  ప్రజలు ఎవరూ భయపడాల్సిన పనిలేదని, పోలీసులు అన్ని విధాలుగా రక్షణ, భద్రత చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. దొంగల ముఠాలపై వాట్సాప్‌ మెసేజ్‌లను ఇతర గ్రూపులకు ఫార్వర్డ్‌ చేసినా, ఫోన్‌లో సమాచారం చేరవేసే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పట్టణంతోపాటు మండలాలు, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన సమయంలో వారిని చితకబాదకుండా తమకు సమాచారం అందించాలని కోరారు. లేకుంటే 100 నంబర్‌కు డయల్‌ చేస్తే అందుబాటులో ఉన్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుంటారని చెప్పారు. రాత్రివేళలో వీరు తారసపడితే సర్పంచు, ఎంపీటీసీతో పోలీసులకు సమాచారం ఇవ్వాలి తప్ప, ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడులు చేయవద్దని సూచించారు. కొత్త వ్యక్తుల కదలికలపై అనుమానం వస్తే పట్టుకోవాలే తప్ప వారి వద్ద ఉన్న వస్తువులను లాక్కొని చితకబాదడం నేరమన్నారు. శాంతి భద్రతల విషయంలో అనుక్షణం పోలీసులు అప్రమత్తంగా ఉం టున్నారని, ప్రజలు నిశ్చింతగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వేసవికాలంలో చెరువులు, పాడుబడిన బావులు, గుంతల్లో పిల్లలు దిగి ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.