పురస్కారాల ఎంపికలో రాజకీయ రగడ సరికాదు

విమర్శలకు తావీయకుండా ఎంపికలు జరగాలి

ఇకముందు పారదర్శకతకు పెద్దపీట వేయాలి

న్యూఢిల్లీ,జనవరి28(జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన దేశ అత్యున్నత పౌర పురస్కారాలపై వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. అనేకులైన ప్రముఖులకు భారతరత్నాలు దక్కలేదన్న ఆవేదన సర్వత్రా ఉంది. మోడీ ప్రధాని అయిన తరవాతనే మదన్‌ మోహన్‌ మాలవ్యాకు పురస్కారం దక్కింది. గతంలో కాంగ్రెస్‌ హయాంలో ఎందరో మహానుభావులకు పురస్కారాలు ప్రకటించలేదు. తాజాగా పివి నరసింహారావు లాంటి వారికి పురస్కరాం దక్కకపోవడంపైనా విమర్శలు ఉన్నాయి. పివికి అవమానం చేశారని పదేపదే పలు సందర్భాల్లో ప్రస్తావించిన ప్రధాని ఓడీ కూడా ఆయన దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారతరత్న ప్రకటించలేక పోయారు. ఇలా వివిధ రంగాల్లో సేవలు చేసిన వారు ఉన్నారు. దివంగత ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌ కూడా ఎప్పటి నుంచో ఉంది. సంగీత సామ్రాట్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ కూడా భారతరత్నకు అర్హున్న భావన కూడా దేశప్రజల్లో ఉంది. దీనిపై రాజకీయాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం కేంద్రంపై ఉంది. ఇకనుంచయినా రాజకీయాలకు అతీతంగా అత్యున్నత పురస్కార ఎంపికలో ప్రమాణాలు పాటించాల్సిన అవసరాన్ని తాజా విమర్శలు గుర్తు చేస్తున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏండ్లయినా ఇప్పటివరకూ ఒక్క సాధువును కూడా భారతరత్న పురస్కారానికి ఎంపిక చేయలేదని యోగా గురువు బాబా రాందేవ్‌ విమర్శించడం గమనించాలి. అలాగే దిగువ మధ్య స్థాయి శాస్త్రవేత్తకు పద్మభూషణ్‌ ఇచ్చారని నంబి నారాయణన్‌ను ఉద్దేశిస్తూ కేరళ మాజీ డీజీపీ టీపీ సేన్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను ప్రధాని మోడీ తమిళనాడు పర్యటనలో ఖండించారు. ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వచ్చిన బాబా రాందేవ్‌ విూడియాతో మాట్లాడుతూ.. దయానంద మహర్షి, స్వామి వివేకానంద వంటి మహనీయులు దేశం కోసం చేసిన సేవలకంటే.. రాజకీయ నాయకులు, క్రీడాకారులు చేసిన సేవ ఎక్కువా? అని ప్రశ్నించారు. నిజానికి వీరు భారతరత్నాలకు అతీతమైన త్యాగధనులు. ఇకపోతే కైస్త్రవ మతానికి చెందిన వారు కావడం వల్లే మదర్‌ థెరెసాకు ఈ అవార్డు లభించింది. హిందువులైన కారణంగానే ఇతర సాధువులకు పురస్కారాలను తిరస్కరిస్తున్నారా అంటూ బాబా రాందేవ్‌ విమర్శలు గుప్పించారు. మరోవైపు గూఢచర్య అభియోగాల నుంచి గతేడాదే బయటపడ్డ ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు పద్మభూషణ్‌ ఇవ్వడంపై 1994లో ఆయనపై విచారణ చేపట్టిన కేరళ మాజీ డీజీపీ సేన్‌కుమార్‌ విమర్శలు గుప్పించారు. నంబి నారాయణన్‌ను దిగువ మధ్య స్థాయి శాస్త్రవేత్తగా పేర్కొన్న ఆయన.. అత్యున్నత పురస్కారాన్ని పొందేందుకు ఆయన ఏం సాధించారని ప్రశ్నించారు. ఇదిలాగే కొనసాగితే వచ్చే ఏడాది నుంచి నేరగాళ్లకు కూడా పద్మ పురస్కారాలు వస్తాయని వ్యాఖ్యానించారు. నారాయణన్‌పై సుప్రీంకోర్టు కమిటీ విచారణ పూర్తయిన తర్వాత ఆయన నిర్దోషిగా తేలితే భారతరత్న ఇచ్చినా అభ్యంతరం లేదని చెప్పారు. కాగా, అసోంకు చెందిన ప్రముఖ గాయకులు భూపేన్‌ హజారికాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గేపై కేసు నమోదైంది. గాయకుడు భూపేన్‌ హజారికా, ఆరెస్సెస్‌ వ్యక్తికి నానాజీ దేశ్‌ముఖ బదులు ఇటీవల కన్నుమూసిన ఆధ్యాత్మిక వేత్త శివకుమార స్వామికి భారతరత్న ఇవ్వాల్సిందని ఖర్గే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అసోం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆర్టీఐ కార్యకర్త ఒకరు ఖర్గేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు భారతరత్న పురస్కారాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం గాయకుడు జుబీన్‌ గార్గ్‌పైనా కేసు నమోదైంది. ఇలాంటి సందర్బాలు ఇకముందు రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. విమర్శలకు పుల్‌స్టాప్‌ పెట్టాలి. భారతరత్నల ఎంపికలు ఇకపై పారదర్శకంగా సాగాలి. అప్పుడే మనం ఇచ్చే పురస్కారాలకు ఔన్నత్యం ఉంటుంది.