పుల్వామాలో ఎన్‌కౌంటర్‌

– ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్‌, మార్చి5(జ‌నంసాక్షి) : పుల్వామాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.. పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం పుల్వామాలో దాగియున్న ఉగ్రవాదుల గుర్తించే పనిలో భారత్‌ జవాన్లు నిమగ్నమయ్యారు. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. త్రాల్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వెంటనే ఆ ప్రాంతంలో సోదాలు ప్రారంభించారు. ఉగ్రవాదులు ఉన్న ఇంటిని నేలమట్టం చేశారు. అయితే ఇంకా
ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం తెలియకపోవడంతో సోదాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 14నాటి ఆత్మాహుతి దాడి తరవాత పుల్వామాలో హై అలర్ట్‌ విధించారు. ఆ ప్రాంతంలో మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేశారు. గత వారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు భద్రతా సిబ్బంది, ఓ పౌరుడు మరణించిన విషయం తెలిసిందే.