పుల్వామా అమరులకు భారీ విరాళం

110 కోట్లు ప్రకటించిన ముర్తజా అహ్మద్‌
న్యూఢిల్లీ,మార్చి5(జ‌నంసాక్షి):  పుల్వామా ఉగ్రదాడి అమరవీరుల కుటుంబాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు ముర్తజా ఏ హవిూద్‌ అనే శాస్త్రవేత్త. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 110 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారాయన. రాజస్థాన్‌కు చెందిన ముర్తజా.. జన్మత అంధుడు. కామర్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆయన.. ప్రస్తుతం ముంబైలో పరిశోధకుడిగా పనిచేస్తున్నారు. అమరవీరుల కుటుంబాల శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధికి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు ప్రకటించిన ముర్తజా.. ప్రధాని మోడీతో అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని కోరుతూ పీఎంవో కార్యాలయానికి మెయిల్‌ చేశారు. మాతృదేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల్ని స్మరించుకోవడం మన బాధ్యతంటున్నా రాయన. తాను కనుగొన్న ‘ఫ్యూయల్‌ బర్న్‌ రేడియేషన్‌ టెక్నాలజీ’ని ప్రభుత్వం ఆమోదించి ఉంటే పుల్వామా వంటి ఘటనలు జరిగే ఆస్కారమే లేదని ముర్తజా అంటున్నారు. జీపీఎస్‌ ,కెమెరా అవసరం లేకుండానే ఓ వాహనం కానీ, ఓ వస్తువు కానీ ఎక్కడుందో ‘ఫ్యూయల్‌ బర్న్‌ రేడియేషన్‌ టెక్నాలజీ’ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ ప్రతిపాదనను పూర్తి ఉచితంగా భారత ప్రభుత్వానికి, నేషనల్‌ హైవేస్‌ అథారిటీకి 2016 సెప్టెంబర్‌లో అందజేసినా.. ఆ తర్వాత దానిపై ముందడుగు పడలేదని చెప్పారు.