పుల్వామా దాడి గురించి ముందే హెచ్చరికలు?

శ్రీనగర్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో దాడి గురించి జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర క్రిమినల్‌ ఇన్విస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌(సీఐడీ) అధికారులు ముందే హెచ్చరిక అందించారని సమాచారం. అందించిన సమాచారాన్ని ఇంటెలిజెన్స్‌ పెడచెవిన పెట్టడం వల్ల్నే ఈ దారుణం జరిగిందని అంటున్నారు.  ఇంటెలిజెన్స్‌ నిర్లక్ష్యం కారణంగానే 44 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. సీఆర్పీఎఫ్‌ జవాన్లను లక్ష్యంగా చేసుకుని జైషే మహ్మద్‌ సంస్థ ఉగ్రవాది దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి కంటే ముందే ఇదే తరహాలో అఫ్గానిస్థాన్‌లో కూడా జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అక్కడ కూడా పేలుడు పదార్థాలతో ఉన్న ఓ వాహనంతోనే దాడి చేశారు.  దాడికి సంబంధించిన వీడియోను జైషే మహ్మద్‌ సంస్థ ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేసింది. అఫ్గానిస్థాన్‌లో దాడికి సంబంధించిన వీడియోను గమనించిన జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర క్రిమినల్‌ ఇన్విస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు వెంటనే ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఆ వీడియోతో పాటు మరింత సమాచారాన్ని కూడా ఇంటెలిజెన్స్‌కు చేరవేశారని సమాచారం.  అయితే ఆ సమాచారాన్ని ఇంటెలిజెన్స్‌ వర్గాలు పట్టించుకోలేదని తెలుస్తోంది. రెండ్రోజుల అనంతరం అదే తరహాలో పుల్వామాలో కూడా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. శ్రీనగర్‌కు భారీ సంఖ్యలో జవాన్లు వెళుతున్నట్టు ఉగ్రవాదులకు ముందుగానే తెలియడం, ఘటన జరిగిన ప్రాంతానికి కేవలం పది కిలోవిూటర్ల దూరంలోనే దాడికి పాల్పడిన ఉగ్రవాది అదిల్‌ అహ్మద్‌ నివాసం ఉండడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.