పుల్వామా దాడి భయానకం
– దాడిపై మాకు నివేదికలు అందాయి
– సరైన సమయంలో దీనిపై స్పందిస్తాం
– అమెరికా అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్, ఫిబ్రవరి20(జనంసాక్షి) : పుల్వామాలో జైషే మహమ్మద్ జరిపిన ఈ ఆత్మహుతి దాడిని భయంకరమైనదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించారు. ఈ ఘటనపై తనకు రిపోర్ట్‌లు వస్తున్నాయని తెలిపిన ట్రంప్.. త్వరలో ఓ ప్రకటన విడుదల చేస్తామని అన్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మంగళవారం వైట్‌హౌస్ ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ విూడియా ప్రతినిధులతో మాట్లాడారు. పుల్వామా ఉగ్రదాడి విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై చాలా నివేదికలు కూడా వచ్చినట్టు వెల్లడించారు. ఈ ఘటనపై సరైన సమయంలో తాము మాట్లాడతామని తెలిపారు. దక్షిణ ఆసియా దేశాలైన భారత్, పాక్‌లు కలిసి ఉంటే అద్భుతంగా ఉంటుందన్నారు.
ఈ ఘటనను ఇప్పటికే ఖండించిన అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి రాబర్ట్ పల్లాడినో తాము భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. జవాన్ల మృతిపై కేవలం తాము సంతాపం తెలుపడమే కాకుండా భారత్‌కు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. ఈ ఘటనపై విచారణకు సహాకరించి.. కారకులపైన కఠిన చర్యలను తీసుకోవాలని ఆయన పాకిస్తాన్‌ను కోరారు. ఈ ఘటన జరిగిన అనంతరం తాము పాక్‌తో మాట్లాడినట్టు వెల్లడించారు. ఉగ్రవాద నిర్మూలనలో దేశానికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ దాడిపై విచారణకు పాకిస్థాన్ పూర్తిసహకారం అందించాలని కోరారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ దేశంతోనూ చర్చలు జరిపామన్నారు. వైట్‌హౌస్‌లోని ఇతర విభాగాలుసైతం దాడిని తీవ్రంగా ఖండించాయన్నారు.