పూరీ జగన్నాధుని సేవలో జస్టిస్‌ రమణ

కటక్‌లో లీగ్‌ సర్వీసెస్‌ అథారిటీ భవనం ప్రారంభం

భువనేశ్వర్‌,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) :  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శనివారం  ఉదయం పూరీ పట్టణంలోని జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీజేఐ ఎన్వీ రమణ రెండు రోజుల ఒడిశా పర్యటన నిమిత్తం శుక్రవారం పూరీకి వెళ్లారు. అక్కడ న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం జగన్నాథ స్వామి దర్శనం అంనతరం కటక్‌లో ఒడిశా స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ నూతన భవనాన్ని జస్టిస్‌ రమణ ఆవిష్కరించారు. జగన్నాథస్వామి ఆలయ సందర్శన సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ వెంట ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రైవేట్‌ సెక్రెటరీ వీకే పాండియన్‌, జగన్నాథ టెంపుల్‌ చీఫ్‌ అడ్మినిస్టేట్రర్‌ క్రిషన్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ సమర్థ్‌ వర్మ ఉన్నారు. అదేవిధంగా ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ మురళీధర్‌, ఆర్కియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఒడిశా సర్కిల్‌ సూపరింటెండెంట్‌ అరుణ్‌ కుమార్‌ మాలిక్‌, పలువురు సీనియర్‌ అధికారులు సీజేఐతో కలిపి స్వామి వారిని దర్శించుకున్నారు. చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ దాదాపు 45 నిమిషాలపాటు ఆలయంలో గడిపారు.