పెట్రోధరలకు తోడు వంటగ్యాస్‌ మంట

క్రమంగా పెరుగుతోన్న ధరలు

వేయికి చేరినా ఆశ్చర్యం లేదంటున్న మార్కెట్‌ వర్గాలు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): చాపికింద నీరులా వంటగ్యాస్‌ సిలిండర్‌పై ధరలను పెంచుతున్నారు. ఇటీవల వరుసగా రూపాయి మొదలకుని ఐదారురూపాయల వరకు పెంచుతూ వచ్చారు. పెట్రో ధరలతో ఇప్పటికే భగ్గుమంటున్న ప్రజలకు తోడు గృహిణులకు వంటింట్లో పిడుగులాంటి వార్త రాబోతున్నది. వంటగ్యాస్‌ ధర మరోసారి పెరగబోతోందని పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై ఇస్తున్న సబ్సిడీని మెల్లగా ఎత్తేస్తూ వస్తున్న ప్రభుత్వం ఇక పూర్తిగా ఎత్తేసేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. భవిష్యత్‌ లో ఏకంగా వేయికి ఎగబాకనుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ధరలు తగ్గకుండా పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పెట్రోధరలతో మరోమారు ధరలు కూడా ఆకాశాన్‌ఇన అంటనున్నాయి. రికార్డు స్థాయిలో సబ్సిడీ లేని సిలిండర్‌ ధర. రూ. 820కి చేరింది. మూలిగే నక్కపై తాడిపండు పడినట్లు మళ్లీ సబ్సిడీ లేని సిలిండర్‌ రేటు రూ.30.50 పెంచేశారు. కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు పలువురు సబ్సిడీని వదులకున్న సంగతి తెలిసిందే.ఆగస్టు మాసంలో రూ. 790 ఉన్న నాన్‌ సబ్సిడీ సిలిండర్‌ ధర ఇప్పుడు రూ. 820.50కి చేరిపోయింది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగుతున్నాయని..గత్యంతరం లేని పరిస్థితుల్లో ధరలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. రెండు..మూడు నెలల్లో ఇదే పరిస్థితి కొనసాగితే సిలిండర్‌ ధరరూ. 1000 కాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా పెరుగుతున్న ఎల్పీజీ సిలిండర్‌ రేటు జనం గుండెల్లో గుబులు రేపుతోంది. అతి త్వరలో సిలిండర్‌ ధర వెయ్యి రూపాయలకు చేరుకోనుందని అభిప్రాయం వెల్లడవుతోంది.