పెట్రోల్, డీజిల్.. ఇక రోజుకో ధర!
త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు రోజువారీగా మారనున్నాయి. ప్రస్తుతానికి ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు ప్రతి పదిహేను రోజులకోసారి ధరలను సవరిస్తున్నాయి. కానీ అమెరికా లాంటి అగ్రరాజ్యాల తరహాలో మన దేశంలోనూ ఏ రోజుకారోజు రేట్లను సవరించాలని కంపెనీలు భావిస్తున్నాయి. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో జరిగిన సమావేశంలో సంస్థల ప్రతినిధులు ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. పెట్రో రేట్లను రోజువారీగా మార్చాలన్న ప్రతిపాదన గత కొద్దికాలంగా వినిపిస్తున్నది. అందుకు అవసరమైన టెక్నాలజీ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గులకు అనుగుణంగా మన మార్కెట్లోనూ ఇంధన రేట్లను సవరించడం ద్వారా వాహనదారులతోపాటు డీలర్లకూ ప్రయోజనమేనని భావిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు (హెచ్‌పీసీఎల్) రిటైల్ ఇంధన మార్కెట్లో 95 శాతం వాటా ఉంది.