పెరిగిన అగ్రి యూనివర్సిటీ స్థాయి

పెరిగిన ర్యాంక్‌: విసి వెల్లడి

హైదరాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 2018-19 విద్యా సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో ఆరో ర్యాంక్‌ సాధించిందని యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రవీణ్‌ రావు వెల్లడించారు. గత ఏడాది 12 వ ర్యాంక్‌ ఉండగా.. ఈ ఏడాది ఆరో ర్యాంకుకు చేరుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ సైఫాబాద్‌ లోని ¬మ్‌ సైన్స్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగేళ్లలో వ్యవసాయ విశ్వ విద్యాలయం అనేక విధాలుగా ముందుకెళుతోందని ప్రవీణ్‌ రావు చెప్పారు. చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పరిశోధన, విస్తరణ కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత మూడు వరి వంగడాలను విడుదల చేసినట్లు తెలిపారు. ఆహార భద్రత, పౌష్టికాహార భద్రత సహా కొత్తగా నియామకాలు, పబ్లికేషన్స్‌, అంతర్జాతీయ-జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రవీణ్‌ రావు వివరించారు.ఈ కార్యక్రమంలో పీజేటీఎస్‌ఏయూ రిజిస్టార్ర్‌ డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌, విస్తరణ సంచాలకులు డాక్టర్‌ రాజిరెడ్డి, పరిశోధన సంచాలకులు డాక్టర్‌ జగదీశ్వర్‌ పాల్గొన్నారు.