పేదలందరికీ డబుల్‌ ఇళ్లు

విపక్షాలది కంఠశోషతప్ప మరోటి కాదు: ఆరూరి

వరంగల్‌,జూలై4(జ‌నం సాక్షి ): ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా వర్దన్నపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ తెలిపారు. మరో 20 సంవత్సరాల వరకూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. గతంలో అధికారంలో ఉండి ప్రజల కష్ట సుఖాలు పట్టించుకోని పార్టీలు ఇప్పుడు ఇంటింటికీ తిరుగుతూ ఏదో చేస్తామని ప్రజల ముందుకు వస్తున్నారని, వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలోనే ఎక్కడలేని రీతిలో రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. రెండు పడక గదుల ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన పేదలకు అందించేందుకు అధికారులు చొరవ చూపాలని సూచించారు. గూడులేని నిరుపేదలను ఆదుకునేందుకే సిఎం కెసిఆర్‌రెండు పడక గదుల ఇళ్లకు శ్రీకారం చుట్టారని అన్నారు. మరిన్ని రెండు పడక గదుల ఇళ్లను నిర్మించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రెండు పడక గదుల పథకం అందేలా చూస్తానని అన్నారు. నియోజకవర్గానికి మొత్తం 14వేల 742 ఇళ్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో విద్యారంగానికి పెద్ద పీఠ వేస్తుందన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్ల కాలంలో నియోజకవర్గానికి వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం నిధులు మంజూరు చేయించానని ఎమ్మెల్యే అన్నారు. సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంతంపై వివక్ష చూపించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్‌ నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేశారన్నారు. దళిత బస్తీ కింద నిరుపేద ఎస్సీలకు మూడు ఎకరాల సాగు భూములు ఇచ్చి కూలీలను రైతులుగా మార్చామన్నారు.