పేదల సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్‌ పథకాలు

పాఠశాలల్లో పెద్ద ఎతున్న హరితహారం చేపట్టాలి: కవిత

ఖమ్మం,జూలై13(జ‌నం సాక్షి): అంగన్‌వాడీలను ప్రశాంతంగా తీర్చిదిద్ది హరిత కేంద్రాలుగా రూపొందించాలని అలాగే కస్తూర్బా పాఠశాలలోని మధ్యాహ్నా భోజనాన్ని నాణ్యతతో అందించాలని జడ్పీ చైర్‌ పర్సన్‌ గడిపల్లి కవిత అన్నారు. లేకుంటే ఆయా నిర్వాహకులపై చర్య తీసుకుంటామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పేద ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పని చేస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. పథకాల అమలులో రాష్ట్రానిదే అగ్రస్థానమని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందకు సీఎం చేస్తున్న కృషిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆడ పిల్లలను ఆదుకునేందుకే సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టి వారి పెండ్లిలకు లక్షపైగాఅందిస్తున్నారని తెలిపారు. బీడీ కార్మికురాలికి నెలకు రూ.వెయ్యి జీవన భృతిని అందించడం జరుగుతుందని అన్నారు. ఒంటరి మహిళలకు సైతం నెలకు వెయ్యి రూపాయల జీవన భృతిని అందిస్తున్నాన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు. ఇకపోతే నాలుగో విడత హరితహారంలో మొక్కలు నాటేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హారితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విజయవంతం చేయాలని అన్నారు. జిల్లాలోని పాఠశాలలు ఈ పద్ధతినే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు, యాజమాన్య కమిటీలు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించాలని, పాఠశాలల్లో మొక్కల సంరక్షణ, పెంపకం, నీటిసౌకర్యం బాధ్యతలను నిర్వహించడానికి గ్రీన్‌బ్రిడ్జిలను విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్య ఏర్పాటు చేయాలన్నారు. పలుచోట్ల నాణ్యత లేని భోజనం

పెడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని కవిత అన్నారు. కొన్నిచోట్ల విద్యార్థులకు అందించే భోజనంలో నాణత్య లేదన్న ఫిర్యాదులురావడంతో నిర్వాహుకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల భవితవ్యాన్ని చిదిమేసే హక్కు ఎవరికీ లేదని, వారికి విద్యను అందించడంతోపాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని స్పష్టం చేశారు. ఇకపోతే చదువుకునే పిల్లలు పాఠశాల్లో ఉండాన్నారు. జిల్లాలో ఎక్కడా బాలకార్మికులు కనిపించడానికి వీల్లేదన్నారు. బాల్య వివాహాలు కూడా జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిరుపేద కుటుంబాల్లో ఈ బాల్యవివాహాలు జరుగుతుండటంతో అవి వెలుగులోకి రావడంలేదని చెప్పారు. ప్రజలు సుఖ,సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిధులు విడుదల చేస్తుంటే ఆయన ఆకాంక్షలకు భిన్నంగా పనిచేయడం తగదన్నారు.