*పై పదహారు పెరుమాళ్ళకెరుక!?*

*•ఆసరా పింఛన్ లో వృద్దులకు రూ.2016 కు రూ.2000… దివ్యాంగులకు రూ.3016 కు గాను రూ.3000 మాత్రమే చెల్లింపు*
*•చిల్లరకు కక్కుర్తి పడుతున్న ప్రబుద్దులు*
బయ్యారం,సెప్టెంబర్10(జనంసాక్షి):
ఆసరా… ఈ పదంలోనే ఒక భరోసా  అని అర్ధమవుతుంది.వృద్ధాప్యంలో తమ సొంత అవసరాలకు ఎవరి మీద ఆధారపడకుండా ఉండేందుకు వృద్దులకు ఒక భరోసా ఈ ఆసరా పింఛన్ పథకం.ఉపాధి లేని దివ్యాంగులకు ఊతం ఈ పథకం. ఒంటరి మహిళలు,వితంతువులకు చేయూత ఈ ఆసరా పింఛన్. అలాంటి ఆసరా పథకం క్షేత్ర స్థాయిలో దోపిడీకి గురవుతుంది.ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారుల, అర్హుల భరోసాకై ప్రతినెలా వారి ఖాతాలో నికర మొత్తం జమ చేస్తూనే ఉన్నప్పటికీ ఈ చెల్లింపులు జరిగే పోస్టాఫిసుల్లో తిరిగి ఆ మొత్తాన్ని లబ్ధిదారులకు అందించే క్రమంలో కొందరు అవినీతిపరులు వృద్ధులు, దివ్యాంగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వృద్ధులకు లబ్ధి  చెందే రూ.2016 లకు గానూ రూ.2000, దివ్యాంగులకు చెల్లించే రూ.3016 గాను రూ.3000 మాత్రమే చెల్లిస్తున్నారు.లబ్ధిదారులు ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే చిల్లర లేవని,కొన్నిచోట్ల రూ.2016 కు రూ.2000 లు మాత్రమే చెల్లిస్తున్నారు.మరికొన్ని చోట్ల చిల్లర రూ.4 ఇస్తే రూ.2020 ఇస్తామని లేకపోతే ఇవ్వలేమని తేల్చి చెప్తున్నారు.కాగా ఏ దిక్కులేని వారు ఎవరికి చెప్పుకోవాలో తెలియక, తిరిగి ప్రశ్నిస్తే తమకు వచ్చే పింఛన్ డబ్బులు కూడా ఎక్కడ రాకుండా పోతాయోననే భయంతో ఎవరూ నోరుమె దపట్లేదు.ఒకరి దగ్గర రూ.16… మండలం మొత్తంలో వందల మంది పింఛన్ దారుల సొమ్మును పింఛన్ చెల్లించే వారు కాజేస్తున్నారు. కొందరు ప్రైవేట్ సంస్థల వారు కొన్ని మొబైల్ ఆప్ ల ద్వారా కూడా గ్రామాల్లోకి వెళ్లి పెన్షన్ చెల్లిస్తామని పింఛన్ దారుల ఇంటికే నేరుగా వెళ్లి మరీ అదే రూ.2000 చెల్లెస్తున్నారు.ప్రైవేట్ వ్యక్తులకు ఆ సంస్థ వారు కమిషన్ ఇస్తున్నప్పటికీ వారు కూడా పింఛన్ దారులను మోసం చేస్తూనే ఉన్నారు.2000 రూపాయలు తీసుకోవడానికి అలవాటు పడిన పింఛన్ దారులు ఇదే అసలు పింఛన్ నగదు అనుకునే భ్రమలో ఉన్నారు.ఇదిలా ఉంటే మరో కోణంలో ఇంకా నమ్మలేని నిజలూ ఉన్నాయి… కొందరు వృద్దులకు బయోమెట్రిక్ సమయంలో వేలిముద్ర పడని వాళ్లకు, పోస్తాఫీస్ కార్యాలయం వరకు రాలేని వృద్దులకు ప్రతీ గ్రామపంచాయతీ కార్యదర్శికి ఆ బాధ్యతను అప్పగించారు.అయితే కొందరు పంచాయతీ కార్యదర్శులు,పింఛన్ ఇచ్చే బీపీఎంలు కుమ్మక్కయి చనిపోయిన వృద్ధుల పింఛన్ డబ్బులను నొక్కేస్తున్నారు.వచ్చిందే చాలు మహాదేవా అన్నట్టుగా  అడిగితే ఇచ్చేవి కూడా రావేమో అనే భయంతో నోరు మెదపట్లేదు లబ్ధిదారులు. కొన్ని విషయాలు వెలుగులోకి వస్తే తప్ప నమ్మడానికి చాలా కష్టం. కావున అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టిసారించి ఆసరా మీదనే ఆధారపడి జీవితాన్ని వెళ్ళదీస్తున్న వృద్ధులకు, దివ్యాంగులకి అన్యాయం జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.