పోడు భూములపై పెత్తనం తగదు

మహబూబాబాద్‌,జూలై7(జ‌నం సాక్షి): గిరిజన పేదలు ఏళ్లనుంచి సాగు చేస్తున్న భూములను పోడు భూముఉల కావంటూ లాక్కొని వారిని పోడు నుంచి వేరుచేయాలని అధికారులు చూస్తున్నారని న్యూడెమక్రసీ నేతలు అన్నారు. దీనిని సహించబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోడు విషయంలో పేదలను వేధిస్తూ, వారికి పట్టాలివ్వకుండా, పట్టాలిచ్చిన వారిని భూముల్లోకి రానివ్వకుండా నిర్బంధాలకు పాల్పడుతున్న ప్రభుత్వానికి పతనం తప్పదన్నారు. పోడు సాగుదారులపై ప్రభుత్వం సాగిస్తోన్న దమనకాండకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పోడు సాగుదారులకు పట్టాలివ్వాలని, వారికి రుణాలు మంజూరు చేయాలని, ఎకరానికి రూ.8 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముందని, వెనుకబడిన ప్రాంతాల్లో ముందస్తు వైద్యశిబిరాలను నిర్వహించాలని కోరారు.