పోలవరం పనుల్లో వేగం పెంచండి
– ప్రాజెక్టు ప్రగతిపై సీఎం చంద్రబాబు సవిూక్ష
అమరావతి, సెప్టెంబర్3(జనం సాక్షి) : పోలవరం నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయని, పనుల్లో వేగం పెంచాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం పోలవరం పనుల ప్రగతిపై సీఎం చంద్రబాబు నాయుడు సవిూక్ష సమావేశం నిర్వహించారు. సవిూక్షలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, ఈఎన్‌సి ఎం.వెంకటేశ్వర రావులు పాల్గొన్నారు. పోలవరం ప్రాంతంలో పనులను లైవ్ ద్వారా వీక్షించి ముఖ్యమంత్రి సవిూక్ష నిర్వహించారు. అధికారులు సిఎంతో మాట్లాడుతూ..గత వారంలో 8.66 లక్షల క్యూబిక్ విూటర్ల తవ్వకాల పనులు జరిగాయని వివరించారు. స్పిల్ వే పనులు 89 వేల క్యూబిక్ విూటర్లకు గాను 87 వేల క్యూ.విూ పనులు జరిగాయని తెలిపారు. ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడుతూ.. పోలవరం పనుల వేగం తగ్గిందని, గత లక్ష్యాలు అధిగమిస్తూనే కొత్త లక్ష్యాన్ని చేరుకోవడం ఒక సవాలుగా తీసుకొని పనులు చేపట్టాలని ఆదేశించారు. వర్షాలు, వరద నీటి వల్ల స్పిల్ ఛానల్ కొంత వేగం తగ్గినా ఈ వారం దానిని అధిగమిస్తామని అధికారులు సిఎంకు తెలిపారు. ఆర్ అండ్ ఆర్, భూసేకరణ, గృహనిర్మాణం, మౌలిక సౌకర్యాలు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. అనంతరం రాష్ట్రంలో వివిధ రిజర్వాయర్లలో నీటి పరిస్థితిపై ముఖ్యమంత్రి సవిూక్షించారు. రిజర్వాయర్లలో నిఘా, భద్రత వ్యవస్థ పటిష్టం చేయాలని, గేట్‌ల నిర్వహణ, తదితర సాంకేతిక అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
రిజర్వాయర్ల దగ్గర భద్రత పటిష్టం చేయండి
ఏపీలో రిజర్వాయర్లలో నీటి పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సవిూక్ష నిర్వహించారు. రిజర్వాయర్ల దగ్గర నిఘా, భద్రతా వ్యవస్థ గట్టిగా ఉండాలన్నారు. గేట్ల నిర్వహణ, సాంకేతిక అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. రాయలసీమలో ఇంకా తక్కువ వర్షపాతం ఉందని, రెండు కోట్ల ఎకరాలకు సాగునీరందించడమే తన లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ డిమాండ్‌ను తీర్చే వ్యూహం అమలు చేయాలని, జలవనరుల శాఖలో ప్రత్యేకంగా ఐటీ విభాగం ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచాంచారు.