పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి ఉద్యోగం
50 లక్షల వరకు పరిహారం
లక్నో,జనవరి28(జనంసాక్షి): ఉత్తర్ ప్రదేశ్‌లోని అమ్రోహాలో ఒక నేరస్థుడికి, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో హర్ష్ చౌధరి (26) అనే కానిస్టేబుల్ మృతి చెందాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఒకరి గురించిన పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అరెస్టు చేయడానికి అమ్రోహిలోని బచ్చాన్ర్ ప్రాంతానికి వెళ్లారని సీనియర్ పోలీసు అధికారి ఆనంద్‌కుమార్ చెప్పారు. అతడిపై 19 క్రిమినల్ కేసులున్నాయని ఆయన చెప్పారు. అతడిని లొంగిపోవాలని పోలీసులు ఆదేశించారని, పోలీసులను చూడగానే అతడు కాల్పులు జరిపాడని ఆయన అన్నారు. ఈ కాల్పుల్లో హర్ష్ చౌధరి తీవ్రంగా గాయపడ్డారని, అతడిని ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడని ఆయన అన్నారు. పోలీసుల కాల్పుల్లో ఆ నేరస్థుడు కూడా మృతి చెందాడన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్ష్ సతీమణికి 40 లక్షల రూపాయిలు, అతడి తల్లిదండ్రులకు10 లక్షల రూపాయిలు పరిహారం ప్రకటించారు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వనున్నారు.



