పోషణలోప నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్21(జనంసాక్షి)
జిల్లాలో పోషణలోప నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె .శశాంక అధికారులను ఆదేశించారు
బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశం మందిరంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్య శాఖ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లాలో పోషణ మాసం కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 0-6 సంవత్సరాల లోపు పిల్లలు వయసుకు తగ్గ బరువు ఎత్తు కలిగి ఉండడం, అదేవిధంగా 15-49 సంవత్సరాల లోపు స్త్రీల లో రక్తహీనత నివారణకు పౌష్టికాహారంతో పాటు అవసరమైన వైద్య సేవలను అందించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని 1437 అంగన్వాడి కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందించాలని ప్రతినెల పోషణ లోప పరీక్షలు నిర్వహించాలని పోషణ లోపం కలిగి ఉన్న పిల్లలను ప్రతి గురువారం పీహెచ్సీలలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. సూపర్వైజరీ సప్లమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రాంలో పర్యవేక్షణతో కూడిన అనుబంధ ఆహార కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం కింద తీసుకున్న 10 అంశాలను గుర్తించి అవసరమైన వైద్య చికిత్స అందించాలని కలెక్టర్ అన్నారు.
బరువు, ఎత్తుకొలుచుట, పోషణ స్థాయిని అంచనా వేయడం, ఆరోగ్య పరీక్ష, పోషకాహార చికిత్స, పోషకాహార ఆరోగ్య విద్య, తదితర కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి జిల్లాలో పోషణలోపం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రామస్థాయిలో అనుబంధ శాఖల కన్వర్జేన్స్ సమావేశాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలని పోషణ లోపం ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కలెక్టర్ అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా సంక్షేమ అధికారి నర్మదా, జిల్లా వైద్య శాఖ అధికారి హరీష్ రాజ్, జిల్లా మలేరియా అధికారి, సిడిపిఓలు, సూపర్వైజర్లు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.