పౌరహక్కుల నేతల గృహనిర్బంధం పొడిగింపు

ట్రయల్‌ కోర్టుకు వెళ్లేందుకు అనుమతి
న్యూఢిల్లీ,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ): వరవరరావు సహా ఐదుగురు పౌరహక్కుల నేతలకు సుప్రీంకోర్టు మరో నాలుగు వారాల పాటు గృహనిర్బంధాన్ని పొడగించింది. భీమా-కొరెగావ్‌ అల్లర్ల కేసులో అరెస్టయిన వారిని విడుదల చేసేందుకు కోర్టు అంగీకరించలేదు. గృహనిర్బంధాన్ని నాలుగు వారాలు పొడగించిన సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్ర వారికి ట్రయల్‌ కోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఇచ్చారు. అలాగే కేసుపై విచారణలో ముందుకెళ్లేందుకు మహారాష్ట్ర పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. హక్కుల నేతల అరెస్ట్‌పై విచారణ జరిపేందుకు సిట్‌ ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. హక్కుల నేతల అరెస్ట్‌పై స్వతంత్ర దర్యాప్తు జరపాలని, సిట్‌ వేయాలని, వారిని తక్షణమే
విడుదల చేయాలని ప్రముఖ చరిత్రకారురాలు రోమిలా థాపర్‌, ఆర్థిక వేత్తలు ప్రభాత్‌ పట్నాయక్‌, దేవకి జైన్‌, సోషియాలజీ ప్రొఫెసర్‌ సతీష్‌ దేశ్‌పాండే తదితరులు పిటిషన్లు దాఖలు చేశారు. కాగా కోర్టు సిట్‌ ఏర్పాటుకు అంగీకరించలేదు. హక్కుల నేతలు వరవరరావు, అరుణ్‌ ఫెరీరా, గోంజాల్వెజ్‌, సుధా భరద్వాజ్‌, గౌతవ్‌ నవలఖాలు ఆగస్టు 29 నుంచి గృహనిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. భీమా కొరేగావ్‌ హింస కేసుకు సంబంధించి పౌరహక్కుల నేతల అరెస్టుకు రాజకీయ అభిప్రాయాలపై విభేదాలు కారణం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అరెస్టులకు దురుద్దేశాలు ఆపాదించలేమని తెలిపింది. పౌర హక్కుల నేతలఅరెస్టు విషయంలో జోక్యానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. వీరి గృహనిర్బంధాన్ని మరో నాలుగు వారాలు పొడిగిస్తూ తీర్పుచెప్పింది. సిట్‌ దర్యాప్తు జరిపించాలన్న పిటిషనర్ల డిమాండ్‌ను తోసిపుచ్చుతూ, పుణె పోలీసులు దర్యాప్తు కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది. అరెస్టయిన నేతలు ఉపశమనం కోసం విచారణ కోర్టుకు వెళ్లవచ్చని కూడా తెలిపింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గత నెల 28న విరసం నేత వరవరరావు సహా పౌర హక్కుల నేతలు వెర్నన్‌ గొనెసాల్వేన్‌, సుధా భరద్వాజ్‌, అరుణ్‌ ఫెరీరా, గౌతమ్‌ నవ్‌లఖాలను పుణె పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం వీరంతా కోర్టు ఆదేశాల మేరకు గృహనిర్బంధంలో ఉన్నారు.