ప్రజాతీర్పును శిరసావహిస్తాం
` ప్రతిపక్ష పార్టీగా సమర్థంగా వ్యవహరిస్తాం
` రెండు దఫాలు అవకాశమిచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు
` బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి): ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఇచ్చిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజా తీర్పును శిరసావహిస్తూ కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు.’’పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. 119 స్థానాలకు గాను ప్రజలు 39 స్థానాలు ఇచ్చి, ప్రతిపక్ష పాత్ర పోషించమని ఆదేశించారు. ప్రజలు ఇచ్చిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తాం. ప్రభుత్వాన్ని అప్పగించినప్పుడు ఎంత విశ్వాసంగా, విశ్వసనీయతతో సేవలందించామో అదే విధంగా పనిచేస్తాం. ఎదురు దెబ్బను ఒక గుణపాఠంగా తీసుకొని.. పాఠాలు నేర్చుకుంటాం. ఈ 23ఏళ్లలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. ఎన్నో సందర్భాల్లో ఎత్తులు.. పల్లాలు చూశాం. అనుకున్న లక్ష్యం తెలంగాణ సాధించాం. ప్రజల దయతో రెండు పర్యాయాలు అధికారం చేపట్టాం. చేసిన అభివృద్ధి పట్ల సంతృప్తి ఉంది.ఈరోజు ఫలితాలు కొంత నిరాశపర్చినా.. బాధలేదు. రాజకీయాల్లో ఇవన్నీ సహజం. నాయకులు, కార్యకర్తల కృషి, పోరాట ఫలితంగానే భారాసకు 39 సీట్లు వచ్చాయి. ప్రతిపక్ష పాత్రలో కూడా అలవోకగా ఇమిడిపోతాం. వందశాతం ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా పనిచేస్తాం. మా పార్టీ శ్రేణులతో పాటు అడుగడుగునా అండగా నిలబడిన, సహకరించిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు హృదయపూర్వక ధన్యవాదాలు. రాజకీయాల్లో స్థితప్రజ్ఞత చాలా అవసరం. గెలుపు అయినా, ఓటమి అయినా ఓకేరకంగా తీసుకోవాలని కేసీఆర్ మాకు నేర్పించారు. గతంలో కంటే రెట్టింపు కష్టపడతాం.. కార్యకర్తలు ఎవరూ నిరాశచెందొద్దు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశమిచ్చారు. వారికి కూడా మా అభినందనలు. ప్రజల ఆకాంక్షలకనుగుణంగా ప్రభుత్వాన్ని నడపాలని కోరుకుంటున్నా. ప్రతిపక్ష పార్టీగా మేం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దు’’ అని కేటీఆర్ తెలిపారు.