ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి….

జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య…
జనగాం కలెక్టరేట్ సెప్టెంబర్ 19(జనం సాక్షి): ప్రజా సమస్యలను వెంటనే తప్పనిసరిగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు.
సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల వద్ద నుండి పలు విజ్ఞప్తులు స్వీకరించారు.
పాలకుర్తి మండలం విసునూరు గ్రామానికి చెందిన వీరంటి శోభ మల్లేష్ తన దరఖాస్తునిస్తూ కూలి పనులపై జీవిస్తున్న తమకు కూతురు 20 సంవత్సరముల వీరంటి సింధు మానసిక దివ్యాంగురాలని గతంలో పింఛన్ మంజూరయ్యి 1500 ప్రతినెల వచ్చేవని ఆధార్ నెంబర్ లేదని నిలుపుదల చేశారని దివ్యాంగురాలు కావడం చేత ఆధార్ నెంబరు సాధ్యం కావడం లేదని అధికారులు చర్యలు తీసుకుని దివ్యాంగురాలు పింఛన్ మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు.రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామానికి చెందిన దినసరి కూలీ పనులు చేస్తున్న పొన్నే లక్ష్మీ నరసయ్య తమ దరఖాస్తునిస్తూ తన భార్య రాజమ్మకు కళ్ళు కనిపించని దివ్యాంగురాలని, పింఛన్ మంజూరు చేయాలని కోరారు.బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన అన్నే బోయిన శిరీష తన భర్త మరణించారని తనకు ఇద్దరు ఆడపిల్లలని వితంతు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దరఖాస్తు సమగ్రంగా పరిశీలించడం జరుగుతుందని అర్హులైన వారికి తప్పనిసరిగా న్యాయం చేకూరుస్తామని తెలిపారు .ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డి ఆర్ డి ఎ పిడి రాంరెడ్డి, జనగామ, స్టేషన్ ఘన్పూర్ ఆర్ డి ఓ లు మధుమోహన్, కృష్ణవేణి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.