ప్రతి మొక్కకు రక్షణకల్పించాలి

నిజామాబాద్‌,జూలై24(జ‌నంసాక్షి):  తెలంగాణాకు హరితహారంలో నాటిన ప్రతి మొక్కకు రక్షణ కల్పించాల్సిన బాద్యత  అధికారులపై ఉంటుందని పంచాయితీరాజ్‌ అధికారులు అన్నారు.  ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం పథకాన్ని పూర్తి స్థాయిలో జిల్లావ్యాప్తంగా పూర్తి చేయడానికి  అధికారులకు సూచనలు చేశారు. నాటిన మొక్కలను రక్షణ  కల్పించి తప్పనిసరిగా ప్రతిరోజు మొక్కలకు నీరు పోయాలన్నారు.  ఎక్కడైనా మొక్కలు చనిపోయినట్లు కనిపిస్తే  వాటిస్థానంలో మళ్లీ నాటాలన్నారు. శాఖల వారిగా అధికారులు నాటిన మొక్కల వివరాలను ఆన్‌లైన్‌ద్వారా నమోదు చేయాలన్నారు. నాటిన మొక్కలకు వందశాతం రక్షణ కల్పించాలన్నారు.  ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు.. ఇందులో భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వం హరితదళాల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. మొక్క నాటే దగ్గర్నుంచి వాటికి నీళ్లు పోసి సంరక్షించే బాధ్యతను హరితదళాలకు అప్పగించి ప్రోత్సాహకాలను అందించనుంది. జిల్లా యం త్రాంగం వీటి ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ఈ హరితదళాలను ఏర్పాటు చేసే పనికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఒకటో తరగతి నుంచి 50 మంది విద్యార్థులను సభ్యులుగా ఓ టీచర్‌ను బ్రిగేడర్‌గా నియమిస్తారు. ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపరుస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ పండ్లు,పూల మొక్కలుపంపిణీ చేసి నాటించారు. ఇప్పుడు వీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.