ప్రత్తిలో రసం పీల్చే పురుగుల నివారణ కై మందు పూత పద్ధతి పై రైతులకు అవగాహన.

పెన్ పహడ్.ఆగస్ట్ 17 (జనం సాక్షి) ; పెన్ పహడ్.మండల కేంద్రంలో
ప్రస్తుతం ప్రత్తి పంటను రసం పీల్చే పురుగులు (పేనుబంక, పచ్చ దోమ, తెల్ల దోమ) ఆశించడం గమనించడం జరిగినది. రసం పీల్చే పురుగులు ప్రత్తిలో తొలి దశ నుంచి మలిదశ వరకు ఆశించి పంటను నాశనం చేస్తుంటాయి. వీటి నివారణకై రైతులు తొలి రెండు నెలల లోపే నాలుగైదు సార్లు మందులు పిచికారి చేస్తున్నారు. దీని వలన రైతులకు ఖర్చు పెరిగిపోతుంది, అలాగే వాతావరణం కాలుష్యం గా మారుతుంది మరియు మిత్ర పురుగుల సంఖ్య తగ్గిపోయి జీవవైవిధ్యం దెబ్బతింటోంది. కావున మందు పిచికారిల సంఖ్యను తగ్గించుకుని, మందు పూత విధానాన్ని రైతులు ఆచరించాలని కె.వి.కె సస్యరక్షణ శాస్త్రవేత్త డి ఆదర్శ్ తెలిపారు. దీనికి రోలింగ్ స్టెమ్ అప్లికేటర్ సహాయంతో పత్తి కాండానికి మధ్య భాగాన ఒక అంగుళం మేర మందును పూయడమే ఈ మందు పూత విధానం. దీని వల్ల తక్కువ సమయంలో ఎక్కువ పంట విస్తిరినానికి మంది పూయోచు. ఈ ప్రక్రియ వలన మొక్క మందును పీల్చుకొని రసం పీల్చే పురుగులను అడ్డుకుంటుంది. పంట విత్తిన 20, 40, 60 రోజులకు మూడు సార్లుగా మోనోక్రోటోఫాస్ 1:4 నిష్పత్తిలో లేదా ఇమిడాక్లోప్రిడ్ 1:20 నిష్పత్తిలో మందును పూయాలని సూచించారు. ఈ విధానాన్ని చేపట్టడం వల్ల పిచికారిల సంఖ్య తగ్గడంతో పాటుగా మందు పరిమాణం కూడా తగ్గి పర్యావరణ హితంగా ఉంటుందని తెలిపారు. మందు పూతను బొట్టు పెట్టే పద్ధతిగా కూడా వ్యవహరిస్తారు. అలాగే ప్రత్తి లో వచ్చే మెగ్నీషియం ధాతు లోపాల యొక్క లక్షణాలను వివరించి వాటి యాజమాన్యాన్ని కై రెండు గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ ను పిచికారి చేసుకోవాలని మరియు పంట ఎదుగుదలకై 10 గ్రా. 19:19:19 లేదా మల్టీ కె పైపాటుగా పిచికారి చేసుకోవాలని కె.వి.కె మృత్తిక శాస్త్రవేత్త ఏ కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లయోలా బి ఎస్ సి అగ్రికల్చర్ విద్యార్థులు వివేక్, వంశీ, అభిలాష్ వెంకటేష్, ఆండ్రూ లీ, హర్షిత్ రెడ్డి, ప్రేమ్ రాజ్ నాయక్, అఖిల్, నవీన్ మరియు రైతులు బంటు హుస్సేన్, మున్నా సైదులు, బాల సైదులు, బంటు జానకమ్మ, ఒగ్గు సైదులు పాల్గొన్నారు.

తాజావార్తలు