ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి * టేకులపల్లి హైస్కూల్లో మన ఊరు మన బడి పనులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ * వసతులు, విద్యపై విద్యార్థులతో ముఖాముఖి
టేకులపల్లి, ఆగస్టు 26( జనం సాక్షి ): ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. శనివారం టేకులపల్లి మండలంలోని పోలింగ్ కేంద్రం 158, 159, 160,161లలో జరుగుతున్న ప్రత్యేక క్యాంపులను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలింగ్ బూత్ నెంబర్లు గోడలపై అస్పష్టంగా ఉండడంతో పోలింగ్ కేంద్రాలు ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా నంబర్లు వేయించాలని ఆదేశించారు. అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ , యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 26వ తేదీ శని, 27వ తేదీ ఆదివారాల్లో జిల్లాలోని 1095 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితాను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా తన ఓటును పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఓటర్ జాబితా పరిశీలన తదుపరి ఏమైనా తప్పులుంటే నిర్ణీత ఫారాలల్లో సవరణలు, మార్పులు, చేర్పులకు దరఖాస్తులు చేసుకునే విధంగా ఓటర్లు కు అవగాహన కల్పించాలని బూతు స్థాయి అధికారులను ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో బూతు స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. చనిపోయిన ఓటరు వివరాలు సేకరించి విచారణ తదుపరి నోటీసులు జారీ చేసిన తదుపరి మాత్రమే తొలగించాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటరుగా నమోదు కావాలని కోరారు. ఓటరు నమోదుకు క్షేత్రస్థాయిలో ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.