ప్రధానికి సొంతకారు కూడా లేదు!

– మొత్తం ఆస్తుల విలువ కేవలం రూ. 2.28కోట్లు మాత్రమే
– మోదీ ఆస్తులపై తాజాగా వివరాలంటూ జాతీయ విూడియా వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : ఛాయ్‌వాలాగా జీవితాన్ని ఆరంభించి ప్రధానమంత్రిగా ఎదిగారు నరేంద్రమోదీ. ఇటీవలే ప్రధానిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు. అయితే ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ప్రధాని మోదీ కూడబెట్టుకున్న ఆస్తులు ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.2.28కోట్లు మాత్రమే. మోదీకి కనీసం సొంత కారు కూడా లేదట. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్తుల వివరాలను కేందప్రభుత్వం తాజాగా వెల్లడించినట్లు కొన్ని జాతీయ విూడియా సంస్థలు పేర్కొన్నాయి. వీటి ప్రకారం.. మార్చి 31, 2018 నాటికి ప్రధాని మోదీ చేతిలో ఉన్న డబ్బు రూ. 48,944. ఇక ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 2.28కోట్లు. ఇందులో రూ. 1.28కోట్లు చరాస్థులు కాగా.. గాంధీనగర్‌లోని మోదీ నివాస స్థలం విలువ రూ. కోటి.
గాంధీనగర్‌లో దాదాపు 900 చదరపు అడుగుల నివాస స్థలాన్ని 2002లో మోదీ రూ. లక్షకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ స్థలం మార్కెట్‌ విలువ రూ. కోటికి పెరిగింది. గాంధీనగర్‌లోని ఎస్‌బీఐ బ్యాంక్‌ బ్రాంచీలో ప్రధాని మోదీకి ఖాతా ఉంది. మార్చి 31 నాటికి అందులో రూ. 11,29,690 నిల్వ ఉన్నాయి. ఇక ఇదే బ్రాంచీలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మల్టీ ఆప్షన్‌ డిపాజిట్‌ స్కీమ్‌ల రూపంలో మోదీ పేరుపై రూ. 1.07కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇవి గాక.. రూ. 5.18లక్షల విలువ గల జాతీయ పొదుపు బాండ్‌, రూ. 1.59లక్షల విలువ గల జీవిత బీమా పాలసీ ఉంది. తాజా వివరాల ప్రకారం.. మోదీ పేరుపై కనీసం సొంత కారు కూడా లేదు. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం ఆయన వద్ద రూ. 1.38లక్షల విలువ గల నాలుగు బంగారు ఉంగరాలు మాత్రమే ఉన్నాయి. అంతేగాక.. ప్రధాని ఏ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నట్లు కూడా తాజా వివరాల్లో లేదు.