ప్రధాని మోడీకి నిరసనలు

ల్లజెండాలతో విద్యార్థుల ప్రదర్శన
గువహటి,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీకి నిరసనల సెగ తగిలింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ వెళ్లేందుకు గువహటి ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న ప్రధానికి.. అసోం విద్యార్థులు నల్లజెండాలతో స్వాగతం పలికారు. బంగ్లాదేశ్‌, అఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌లకు చెందిన ముస్లిమేతర శరణార్థులను దేశంలోకి అనుమతిస్తూ పౌరసత్వ బిల్లుకు కేంద్రం ప్రభుత్వం సవరణలు చేసింది. గత జనవరిలో ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో అసోం అంతటా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. సంకీర్ణ ప్రభుత్వంలోని అసోం గణపరిషత్‌ తన మద్దతును ఉపసంహరించుకోవడం విశేషం. తాజాగా ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌, అస్సాం జాతీయవాది యువ ఛాత్రపరిషత్‌కు చెందిన విద్యార్థులు నల్లజెండాలు చేతపట్టి గువహటి ఎయిర్‌ పోర్టుకు చేరుకుని.. ప్రధానికి ఎదుట తమ నిరసనలు వ్యక్తం చేశారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఏడుగురు విద్యార్థులను నిర్బంధంలోకి తీసుకున్నారు.