ప్రబుత్వ సొమ్ముతో ఓట్లు కొనుగోలు

కిసాన్‌ సమ్మాన్‌ నిధిపై చిదంబరం మండిపాటు
ఎన్నికల సంఘం ఎందుకు అడ్డుకోదని విమర్శ
న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): ప్రభుత్వ డబ్బుతో భాజపా ఓట్లను కొంటోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఆరోపించారు.  కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా తొలి విడతగా రైతులకు డబ్బులు ఇవ్వనున్న నేపథ్యంలో ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ పథకాన్ని ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో చిందంబరం ట్విట్టర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని ఓట్ల కోసం ఇస్తున్న లంచంగా పేర్కొన్నారు. దీన్ని ఎన్నికల సంఘం అడ్డుకోకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఈ పథకం ద్వారా సాగుచేయని భూస్వాములకు సైతం డబ్బు చేరుతుందని అభిప్రాయపడ్డారు. తొలివిడతగా ఉత్తరప్రదేశ్‌, కర్ణాటకతో పాటు మరో 14 రాష్ట్రాల్లో  కోటి మంది రైతులకు రూ.2000 చొప్పున అందించ నున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. అలాగే మరో రెండు, మూడు రోజుల్లో మరో కొటి మంది రైతులకు డబ్బులు అందనున్నా యని తెలిపారు. 2019-20 బ్జడెట్‌లో కేంద్ర ప్రభుత్వం పీఎం-కిసాన్‌ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ద్వారా ఐదు ఎకరాల కంటే తక్కువ సాగుభూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.6 వేల అందించనున్నారు.