ప్రభుత్వం బకాయిలు వెంటనే విడుదల చేయాలి
– లేనిచో ఏప్రిల్ నుంచి జిపిలో పనులు నిలిపివేస్తాం – గ్రామసభ లో నాగారం సర్పంచ్ బూడిద మల్లేష్ జనం సాక్షి , మంథని : గ్రామపచాయతీలకి బకాయిలు ఉన్న రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులు వెంటనే విడుదల చేయాలని నాగారం సర్పంచ్ బూడిద మల్లేష్ డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ పారిశుధ్యం, పచ్చదనం, వీధిదీపాలు , ఇతర పనులు చేయటం కష్టతరముగా ఉన్నదన్నారు. బకాయి పడ్డ నిధులు వెంటనే విడుదల చేయాలని, లేనిచో ఏప్రిల్ నెల నుండి గ్రామపంచాయతీ పనులు నిలిపివేయనున్నట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ బూడిద మల్లేష్ అధ్యక్షతన మిషన్ అంత్యోదయ గ్రామసభ సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పంచ్ మాట్లాడుతూ.. మిషన్ అంత్యోదయ బెస్ లైన్ సర్వేలో గుర్తించిన క్రిటికల్ గ్యాప్స్ ను తగ్గించే విధంగా బడ్జెట్ ను రూపొందించి ప్రజలకు మెరుగైన సేవలు, మౌలిక వసతులు కల్పించుటకు పాలకవర్గం కృషి చేస్తుందని తెలిపినారు. గ్రామంలో జీవో నెం,58, 59 లబ్ధిదారులకు ప్రభుత్వమే ఉచితంగా పట్టాలు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో హైమాస్ట్ లైట్స్ అతి త్వరలో నిర్మాణం చేయబోతున్నామని తెలియజేశారు. రాబోవు ఎండాకాలంలో గ్రామంలో మంచినీటి సమస్య లేకుండా చూస్తానని మరియు ప్రజలు నీటిని వృధా చేయకూడదని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజలు పలువురు అడిగిన సమస్యలకు సర్పంచ్ వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలియజేశారు. ఎమ్ జీ ఎన్ఆర్ఈజీఎస్ లో భాగంగా నిర్మించిన కమ్యూనిటీ సోక్ ఫిట్స్, వర్క్ సైట్ బోర్డ్స్ , మొక్కలకు వాటరింగ్ పనులకు సంబంధించి రావలసిన బకాయిలు గత సంవత్సరం కాలంగా రాలేదని అన్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి పల్లె అనిల్ అంత్యోదయ బేస్ లైన్ సర్వే 2022 వివరాలు చదివి గ్రామస్తులకు వివరించడం జరిగింది. ఈ గ్రామ సభలో వార్డు సభ్యులు రామ్ శ్రీనివాస్ ,మద్దెల మల్లేశ్వరి ,దాసరి తార, గ్రామస్థాయి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.